పిచ్చి కుక్కలను చంపొచ్చు..సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పిచ్చి కుక్కలను చంపొచ్చు..సుప్రీంకోర్టు సంచలన తీర్పు
  • కారుణ్య మరణానికి అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు
  • గత ఆదేశాల సవరణకు కోర్టు నిరాకరణ
  • వీధికుక్కలను షెల్టర్ హోమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించాల్సిందే
  • చిన్నారులు, వృద్ధులపై కుక్కల దాడిని విస్మరించలేం
  • రాష్ట్రాల ఉదాసీనతపై అసంతృప్తి
  • ఏడబ్ల్యూబీఐ రూల్స్​ను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలి
  • ప్రతి జిల్లాలో బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న బెంచ్
  • ఉత్తర్వులను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని వార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:మనుషులపై దాడి చేస్తున్న పిచ్చి కుక్కలను చంపొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో పెరిగిపోతున్న వీధికుక్కల స్వైరవిహారం, వాటి దాడులపై   సంచలన తీర్పును వెలువరించింది. రేబిస్‌‌‌‌‌‌‌‌ సోకి పిచ్చిపట్టిన, తీవ్ర దూకుడుగా వ్యవహరిస్తూ, దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధికుక్కలకు ‘కారుణ్య మరణం’ (యుథనేషియా) అమలు చేయడానికి అధికారులకు అనుమతినిచ్చింది. వీధికుక్కల తరలింపుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. 

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను కొట్టివేస్తూ, వీధికుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం ఆందోళనకరం’ అని వ్యాఖ్యానించింది.‘‘యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు, ఇతర చట్టబద్ధమైన ప్రొటోకాల్స్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టుగా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న, పిచ్చిపట్టిన, మనుషులకు ప్రమాదకరంగా మారిన వీధికుక్కలను కారుణ్య మరణం ద్వారా చంపేందుకు చట్టం అనుమతిస్తుంది” అని స్పష్టం చేసింది. 

పాఠశాలలు, ఆసుపత్రులులాంటి బహిరంగ ప్రదేశాల నుంచి తరలించిన శునకాలను తిరిగి ఆ ప్రాంతాల్లో వదిలేయొద్దని పేర్కొన్నది. వాటి సంతానోత్పత్తిని నియంత్రించేందుకు, ప్రజలకు భద్రత కల్పించడంపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది.  కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.

 కుక్క కాట్లను నిర్లక్ష్యం చేయలేం!

పసిపిల్లలు, వృద్ధులు కుక్కల దాడులకు గురవుతున్న దారుణ పరిస్థితులను చూస్తూ తాము ఊరుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వీధికుక్కలను తొలగించి, షెల్టర్ హోమ్‌‌‌‌లకు తరలించాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి నిరాకరించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత, తమ ఆదేశాల అమలులో విఫలం కావడంపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘చిన్నారులు, వృద్ధులు, విదేశీ ప్రయాణికులు వీధికుక్కల దాడులకు గురవుతున్న చేదు నిజాలను కోర్టు మర్చిపోలేదు. 

మన పిల్లలు, పెద్దలు కుక్కల దయ మీదో.. లేదా వాటితో పోరాడే శారీరక బలం ఉంటేనే బతకాలనే దారుణమైన సమాజాన్ని మన రాజ్యాంగం ఎప్పుడూ కోరుకోలేదు” అని వ్యాఖ్యానించింది. ప్రజలు కుక్కల దాడుల భయం లేకుండా, గౌరవప్రదంగా జీవించే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నారని కోర్టు తెలిపింది. ఈ భయానక వాతావరణంలో ప్రభుత్వం కేవలం ఏమీచేయలేని ఓ ప్రేక్షకుడిగా మిగిలిపోకూడదని హెచ్చరించింది. పెరుగుతున్న కుక్కల జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను, నిఘా కేంద్రాలను విస్తరించడంలో స్పష్టమైన వైఫల్యం కనిపిస్తోందని మండిపడింది. సంతానోత్పత్తి నియంత్రణ, టీకాల కార్యక్రమాలు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా మొక్కుబడిగా సాగుతున్నాయని, రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలతో వ్యవహరించి ఉంటే, పరిస్థితి ఇంత తీవ్ర రూపం దాల్చేది కాదు అని పేర్కొన్నది. 

సుప్రీంకోర్టు జారీ చేసిన ప్రధాన ఆదేశాలు 

  • యానిమల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ బోర్డ్​ ఆఫ్​ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) రూల్స్‌‌‌‌ను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలి
  • జంతు సంతానోత్పత్తి నియంత్రణ (ఏబీసీ) వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తి స్థాయి కార్యాచరణ కలిగిన కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన సిబ్బంది, శస్త్రచికిత్స సౌకర్యాలను కల్పించాలి.
  •  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో యాంటీ- రేబిస్‌‌‌‌ వ్యాక్సిన్లు, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి.
  • ఈ బాధ్యతలను నిర్వర్తించే మున్సిపల్, స్థానిక అధికారులపై విధి నిర్వహణలో భాగంగా సాధారణంగా పోలీస్ కేసులు నమోదు చేయకూడదు.