న్యూఢిల్లీ: చక్కటి ఆరోగ్యంతో బతికేందుకు అవకాశం ఉన్న బిడ్డను కోర్టు ద్వారా హత్య చేయించాలని చూస్తారా? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలని కోర్టును ఆశ్రయించిన పిటిషనర్‌ను ఈ మేరకు ప్రశ్నించింది. అలాగే పిటిషనర్‌తో మాట్లాడాలని కేంద్ర ప్రభుత్వం తరఫు లాయర్ ను ఆదేశించింది. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న తను ఇంకో బిడ్డను కని,పెంచేందుకు మానసికంగా సిద్ధంగా లేనని, డిప్రెషన్, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది.
అక్టోబర్ 9న ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ఇద్దరు సభ్యుల బెంచ్ అబార్షన్‌కు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గురువారం సుప్రీం కోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ తో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ‘బిడ్డ పుట్టడానికి సిద్ధంగా ఉంది. పిండం సజీవంగా, ఆరోగ్యవంతంగా ఉందని ఎయిమ్స్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. కనుక అబార్షన్ చేయడం సరికాదు. అబార్షన్ చేయాలనే ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలి’ అని ఆమె అన్నారు. అలాగే ‘ఆమె (పిటిషనర్) అత్యాచారానికి గురికాలేదు. మైనర్ కూడా కాదు. ఈ విషయంలో 26 వారాలుగా ఆమె ఏం చేస్తున్నది?" అనే ప్రశ్నను లేవనెత్తారు. వాదనలు విన్న సీజే మాట్లాడుతూ సజీవంగా ఉన్న ఒక బిడ్డ గుండె చప్పుడు ఆపాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారా? అని పిటిషనర్ ను ప్రశ్నించారు. గర్భస్థ శిశువు హక్కులను పరిశీలించాలంటూ.. ఇద్దరు సభ్యుల బెంచ్ ఇచ్చిన ఆబార్షన్ ఆదేశాలను రీకాల్ చేశారు.
