హార్మూజ్ నుంచి బయటకొచ్చిన మూడు నౌకలు

హార్మూజ్ నుంచి బయటకొచ్చిన మూడు నౌకలు

టెహ్రాన్: హార్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ, ఒమన్ తీరం వెంబడి కొత్త మార్గం ద్వారా మూడు భారీ నౌకలు సురక్షితంగా బయటపడటం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ఇరాన్ ప్రాదేశిక జలాల గుండా వెళ్లే ఉత్తర మార్గానికి భిన్నంగా, ఈ మూడు నౌకలు ఒమన్ తీరానికి ఆనుకుని దక్షిణ మార్గం ద్వారా ప్రయాణించాయి. ఇందులో రెండు భారీ చమురు ట్యాంకర్లు, ఒకటి ఎల్​ఎన్​జీ వాహక నౌక ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్ ప్రాంతం నుంచి బయటపడిన మొదటి ఎల్​ఎన్​జీ నౌక ఇదే కావడం గమనార్హం. 

ఈ మూడు నౌకలు ‘ఒమన్ షిప్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ’ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ప్రయాణ సమయంలో ఇవి ఒమన్‌‌‌‌‌‌‌‌కు చెందిన నౌకలుగా సిగ్నల్స్ ఇచ్చాయి. హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు అస్తవ్యస్తమయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్ తన పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ తన జలాల గుండా వెళ్లే నౌకల నుంచి ఒక్కో ప్రయాణానికి సుమారు రూ.16 కోట్ల వరకు రుసుము వసూలు చేయాలని చూస్తోంది. 

ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను పర్యవేక్షించేందుకు ఒమన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఒక ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇంటెన్స్ సిగ్నల్ జామింగ్, స్పూఫింగ్ కారణంగా నౌకల కదలికలను గుర్తించడం కష్టతరంగా మారింది. ఈ 3 నౌకలు ముసందమ్ ద్వీపకల్పం వద్దకు రాగానే తమ పొజిషన్ సిగ్నల్స్ నిలిపివేశాయి. ఒక ట్యాంకర్ ఫిబ్రవరి చివరిలో సౌదీలో చమురు లోడ్ చేసుకుని, మయన్మార్‌‌‌‌‌‌‌‌లోని ఓడరేవుకు వెళ్తోంది. రెండో ట్యాంకర్ అబుదాబి నుంచి చమురును తీసుకువెళ్తోంది, అయితే దాని గమ్యస్థానం వెల్లడి కాలేదు.