భారతదేశ రిజర్వేషన్ల వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రశ్న ‘మతం మారితే కులం మారుతుందా?’ 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు, ఇటీవల 'చింతడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' (24 మార్చి 2026) కేసులో వెలువడిన తీర్పు.. కులం అనేది ఒక వ్యక్తి అనుసరించే మతంపై ఆధారపడి ఉంటుందనే వాదనను కొనసాగిస్తున్నాయి. ఈ మినహాయింపు కేవలం ఒక చారిత్రక పొరపాటు మాత్రమే కాదు. ఇది రాజ్యాంగం వాగ్దానం చేసిన సమానత్వానికి (ఆర్టికల్ 14, 15, 17), సామాజిక వాస్తవానికి, మతస్వేచ్ఛకు (ఆర్టికల్ 25) విరుద్ధమని చెప్పాలి. భారత రాజ్యాంగం ఎస్సీ హోదాను అస్పృశ్యత, కుల వివక్ష వల్ల కలిగే సామాజిక వెనుకబాటుతనానికి ఒక పరిష్కారంగా భావించింది తప్ప, మతపరమైన అర్హతగా చూడలేదు. పైగా మతపరమైన షరతులు లేని సమానత్వం వాగ్దానం చేసింది. ఆర్టికల్ 14, 15 చట్టం ముందు అందరూ సమానమని, మతం ప్రాతిపదికన వివక్ష చూపకూడదని స్పష్టం చేస్తున్నాయి. ఆర్టికల్ 17 అస్పృశ్యతను ‘ఏ రూపంలో ఉన్నా’ నిషేధించింది.
ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన ఏ రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్ 330, 332, 335, 341) మతపరమైన పరీక్షను విధించలేదు. ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించే అధికారం కలిగి ఉంటారు. అయితే, 1950లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులోని 3వ పేరా.. హిందూ మతాన్ని కాదని ఇతర మతాలను స్వీకరించిన వారికి ఎస్సీ హోదాను నిరాకరించింది. తదనంతర కాలంలో రాజ్యాంగ సవరణల ద్వారా 1956లో సిక్కులను, 1990లో నవబౌద్ధులను ఈ జాబితాలో చేర్చారు. ఈ విస్తరణ వెనుక ఉన్న తర్కం ఏమిటంటే సిక్కు లేదా బౌద్ధ మతాల్లోకి మారినప్పటికీ, ఆ వ్యక్తుల సామాజిక స్థితిగతులలో మార్పు రాలేదని, వారు ఇంకా 'అస్పృశ్యత' దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. మరి అదే తర్కాన్ని క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారిన దళితులకు కూడా ఎందుకు వర్తింపజేయకూడదు?
- క్రైస్తవులలో కులప్రాతిపదికనే వివాహాలు
ఈ ఉత్తర్వు' మతం ప్రాతిపదికన దళితుల మధ్య ఒక అదృశ్యపు వివక్ష గోడను నిర్మించడమే. కేవలం భారతీయ 'హిందూ' మూలాలు కలిగిన మతాలకే ప్రాధాన్యత ఇవ్వడం రాజ్యాంగం ప్రబోధించే లౌకికవాదానికి , సమానత్వాన్ని ప్రభోదించే రాజ్యాంగ తాత్విక విలువలకు గొడ్డలి పెట్టు. కులం పుట్టుకతో వస్తుంది తప్ప, వ్యక్తి ఎంచుకునే ఆధ్యాత్మిక విశ్వాసంతో అది అంతం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్, ఎం.ఎన్. శ్రీనివాస్, కంచె ఐలయ్య షఫర్డ్ వంటి సామాజికవేత్తలు నిరూపించినట్లుగా, భారతీయ క్రైస్తవ సమాజం శూన్యంలో లేదు; అది భారతీయ కుల వ్యవస్థ లోనే ఇమిడి ఉంది.
అది మత మార్పిడి తర్వాత కూడా సజీవంగా ఉండే ఒక లోతైన హెచ్చు తగ్గుల సామాజిక నిర్మాణం. దళిత క్రైస్తవులు నేటికీ అదే వివక్షను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక స్మశానవాటికలు, చర్చిలలో వేర్వేరు సీట్లు, కులాంతర వివాహాల నిరాకరణ, గ్రామీణ శ్రమ విపణిలో ఆర్థిక వివక్ష ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో దళిత క్రైస్తవులు ఇప్పటికీ ప్రత్యేక కాలనీలలోనే (దళితవాడలు) నివసిస్తున్నారు. క్రైస్తవులలో కూడా వివాహాలు కుల ప్రాతిపదికనే జరుగుతున్నాయి తప్ప మత ప్రాతిపదికన కాదు. భారతదేశంలో క్రైస్తవ మతం కేవలం ఒక మతపరమైన సమూహంగా కాకుండా, దేశంలోని సంక్లిష్టమైన సామాజిక, కుల నిర్మాణాలతో పెనవేసుకొని ఉంది. క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ చాలామంది తమ పూర్వపు కుల గుర్తింపులను, ఆచారాలను వదులుకోలేదు. దీనివల్ల క్రైస్తవులలో కూడా వివిధ సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి.
- ఎస్సీ హోదాను మతంతో ముడిపెట్టడం రాజ్యాంగ విరుద్ధం
భారతీయ క్రైస్తవులు బ్రాహ్మణ, క్షత్రియ, ఛార్డో, నాడార్, ముక్కువార్, రెడ్డి, కమ్మ, కాపు, దళిత, ఆదివాసీ విడిపోయి ఉన్నారు. కులం మూలంగా వీరి మధ్య ఎలాంటి సామాజిక, మత సంబంధాలకు ఆస్కారం, అంగీకారం ఉండదు. కమిషన్ల నివేదికలు, గణాంక ఆధారాలు దళిత క్రైస్తవుల డిమాండ్ కేవలం భావోద్వేగపూరితమైనది కాదు. అది శాస్త్రీయ ఆధారాలతో కూడినది. కాకా కలేల్కర్ కమిషన్ (1955), కులం అనేది మతాతీతమైనదని, క్రైస్తవంలోకి మారిన దళితులు తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారని మొదటిసారిగా గుర్తించింది.
మండల్ కమిషన్ (1980), సచార్ కమిషన్ (2006)లు కూడా ప్రస్తావించాయి. రంగనాథ్ మిశ్రా కమిషన్ (2007) నివేదిక అత్యంత కీలకమైనది. ‘దళితులు మతం మారిన తర్వాత కూడా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో ఎటువంటి మార్పు రాలేదు. కాబట్టి ఎస్సీ హోదాను మతంతో ముడిపెట్టడం రాజ్యాంగ విరుద్ధం’ అని స్పష్టం చేస్తూ 1950 ఉత్తర్వును రద్దు చేయాలని సిఫార్సు చేసింది. దేశ్‌పాండే, బాప్నా అధ్యయనం (2008) నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కోసం చేసిన ఈ అధ్యయనంలో, దళిత క్రైస్తవుల ఆర్థిక స్థితిగతులు హిందూ దళితుల కంటే మెరుగ్గా ఏమీ లేవని, అనేక సందర్భాల్లో వారు అత్యంత వెనకబడి ఉన్నారని గణాంకాలతో నిరూపించారు.
- నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు
మత మార్పిడి అనేది అణచివేత నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నమని, దానికి శిక్షగా ప్రభుత్వం రిజర్వేషన్లు తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘన అని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. కొంతమంది దళితులు కుల వివక్ష నుంచి విముక్తి కోసం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. కానీ, అది సామాజికంగా వారిని విముక్తులను చేయలేక విముక్తి మార్గంలో మత మార్పిడి వైఫల్యం అయ్యింది. దళితులపై దాడులు చేసేవారు వారి కుల మూలాలను చూసి దాడులు చేస్తున్నారు తప్ప వారి నూతన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చూసి కాదు. ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం-1989 దళిత క్రైస్తవులకు వర్తించకపోవడం ఒక దుర్భర పరిస్థితిని సృష్టిస్తోంది. ఆధిపత్య కుల వ్యవస్థ వారిని అవమానించడానికి 'దళితులు'గా గుర్తిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం హక్కులు ఇవ్వడానికి వారిని 'దళితులు'గా గుర్తించదు. చింతడ ఆనంద్ తీర్పు ఈ వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక పాస్టర్‌పై కులపరమైన దూషణలు జరిగినప్పుడు.. అతను క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నందున 1950 ఉత్తర్వు ప్రకారం అతని ఎస్సీ హోదా రద్దవుతుందని, తద్వారా అత్యాచార నిరోధక చట్టం కింద రక్షణ లభించదని కోర్టు పేర్కొంది. ఇది కేవలం చట్టం అక్షర క్రమాన్ని అనుసరించడమే తప్ప, సామాజిక వాస్తవాలను, రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మత స్వేచ్ఛ, ఆర్థిక అడ్డంకులు ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కును ఇస్తోంది. అయితే, ప్రస్తుత వ్యవస్థ మతం మారితే విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్పులు, చట్టపరమైన రక్షణలు కోల్పోతారని హెచ్చరించడం ద్వారా ఒక రకమైన 'ఆర్థిక శిక్ష'ను విధిస్తోంది.
- క్షేత్రస్థాయి వివక్షను పరిగణనలోకి తీసుకోవాలి
ఎస్సీ హోదాను దళిత క్రైస్తవులకు విస్తరించడం వల్ల ఎవరి మత సిద్ధాంతాలు మారవు. కేవలం సామాజిక వెనుకబాటుతనానికి ప్రభుత్వం ఇచ్చే రక్షణలు మతాతీతంగా అందుతాయి. కాంగ్రెస్, డీఎంకే, వైఎస్ఆర్సీపీ ఇతర ప్రాంతీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి. హిందూ మతం నుండి విడిపోయిన మతాలకు (సిక్కు, బౌద్ధ) మాత్రమే ఎస్సీ హోదా ఉండాలని, అబ్రహామిక్ మతాలకు ఇది వర్తించకూడదని బ్రాహ్మణీయ కుల వ్యవస్థను కొనసాగించేలా బీజేపీ వాదిస్తోంది. ఇది మత మార్పిడులను ప్రోత్సహిస్తుందని వారి ఆందోళన. పార్లమెంటరీ చట్ట సవరణ ద్వారా1950 రాష్ట్రపతి ఉత్తర్వులోని 3వ పేరాను తొలగించి ఎస్సీ హోదాను, అత్యాచార నిరోధక చట్టాన్ని మతంతో సంబంధం లేకుండా దళితులందరికీ ఈ చట్టం వర్తింపజేయాలి.
- డా. సుదర్శన్ బాలబోయిన
అసిస్టెంట్ ప్రొఫెసర్,
ఉస్మానియా యూనివర్సిటీ
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
