మేడ్చల్: ఘట్ కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి హల్చల్ సృష్టించాడు. మంగళవారం (మే 19) సాయంత్రం వేళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా డ్యూటీలో ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, చికిత్స పొందుతున్న రోగులపై దాడికి దిగాడు. చాకుతో ఆసుపత్రిలోని సిబ్బందిపై దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలోని మెడిసిన్ సామాగ్రి, ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.
వైద్యులు, రోగులు, వారి బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిన సైకో బయట కూడా స్థానికులపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే, పోలీసులపై ఆ సైకో దాడి చేయడానికి యత్నించినట్లు సమాచారం. ఓ కానిస్టేబుల్ స్వల్పగా గాయపడ్డాడు.
దీంతో అక్కడున్న స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి సైకోను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో సైకోకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తే వీరంగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
