లక్నో బ్యాటర్ల విధ్వంసం.. సెంచరీ మిస్ చేసుకున్న మార్ష్.. రాజస్థాన్ టార్గెట్ 221

లక్నో బ్యాటర్ల విధ్వంసం.. సెంచరీ మిస్ చేసుకున్న మార్ష్.. రాజస్థాన్ టార్గెట్ 221

LSG vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో ఓపెనర్లు రాజస్థాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు.

ఇంగ్లీస్ మెరుపులు.. మార్ష్ క్లాస్ ఇన్నింగ్స్!
లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీస్ కిరాక్ ఆరంభాన్ని ఇచ్చారు. రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరూ క్రేజీ షాట్లతో స్కోరు బోర్డును పరిగెత్తించారు. కేవలం 29 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసిన ఇంగ్లీస్ ప్రమాదకరంగా మారుతున్న వేళ.. యశ్ రాజ్ పుంజా ఒక అద్భుతమైన బంతితో అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మొదటి వికెట్‌కు నమోదైన 109 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

సెంచరీ చేజార్చుకున్న మిచెల్ మార్ష్: 
ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగించాడు. రాజస్థాన్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడిన మార్ష్.. 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్ (20వ ఓవర్) 5వ బంతికి దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు.

మిడిల్ ఆర్డర్‌లో తడబడిన లక్నో: 
ఓపెనర్లు ఇచ్చిన అద్భుతంగా ఆడినప్పటికీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. ఇంగ్లీస్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హిట్టర్ నికోలస్ పూరన్ (16) ఎక్కువ సేపు నిలవలేదు. యశ్ రాజ్ పుంజా బౌలింగ్‌లోనే డోనోవన్ ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. మార్ష్‌తో కలిసి 64 పరుగులు జోడించినప్పటికీ.. 20వ ఓవర్ మొదటి బంతికే పంత్ (35 పరుగులు) రనౌట్ అయ్యాడు. అయినప్పటికీ మార్ష్ ధాటికి లక్నో 220 పరుగుల మార్కును అందుకుంది.