ఒక దేశాభివృద్ధి ఆ దేశ మానవ వనరుల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఆలాంటి మానవ వనరుల అభివృద్ధికి కేంద్రాలు యూనివర్సిటీలు. కేవలం మానవ వనరుల నిర్మాణమే కాకుండా.. పరిశోధనలు, ‘ఇన్నోవేషన్’ ల ద్వారా ఇటు రాష్ట్ర, అటు దేశ పురోగమనానికి బాటలు వేసేవి యూనివర్సిటీలు. మన దేశంలో సుమారు 57 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 515 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
మన రాష్ట్రానికి వస్తే 19 రాష్ట్ర యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు 4 ఉన్నాయి. దేశ అభివృద్ధికి కీలకమైన మానవ వనరులను అందించడంలో యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ ల పాత్ర కీలకమైనది. ఒకవిధంగా చెప్పాలంటే దేశ ఉజ్వల భవిష్యత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది వీరే.
యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల పాత్ర కేవలం విద్యార్థి సర్వతోముఖాభివృద్దికి మాత్రమే పరిమితం కాదు. ప్రాజెక్టులు, పరిశోధనలు, ఇన్నోవేషన్లు ఇలా అనేకరకాల అకడమిక్, నాన్ అకడమిక్ కార్యకలాపాలతో వారి జీవితాన్ని యూనివర్సిటీలకు అంకితం చేస్తారు.
కానీ, గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో పనిచేసే ప్రొఫెసర్ల పరిస్థితి దయనీయంగా మారింది. స్టేట్ యూనివర్సిటీలలో పనిచేసే ప్రొఫెసర్లకు సంబంధించిన సంక్షేమాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మరిచాయి. ఈ పరిస్థితి ఏ ఒక్క రాష్ట్రానికో సంబంధించినది కాదు. కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా దాదాపుగా దేశంలోని అన్ని స్టేట్ యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉన్నది.
పెన్షన్ పథకాన్ని అమలుచేయాలి
దేశంలో పబ్లిక్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెన్షన్ విధానంపై అన్ని పబ్లిక్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఓ.పి.ఎస్ విధానం ద్వారా రిటైర్ అయిన అధ్యాపకులకు ప్రతినెలా పెన్షన్ ఉండేది. కానీ, ఇప్పుడు పెన్షన్ విధానం తీసేశారు.
ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత సి.పి.ఎస్ విధానంలో పెన్షన్ అందిస్తుండగా, యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులకు మాత్రం అదికూడా లేదు. కేవలం 5 సంవత్సరాలు ఎం.ఎల్.ఏ లేదా ఎంపీగా పనిచేసిన ప్రజా ప్రతినిధులకు ప్రతినెలా పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వాలు, జీవితాంతం యూనివర్సిటీలో పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, సమాజానికి వెలకట్టలేని ప్రయోజనాన్ని అందించిన ప్రొఫెసర్లను రిటైర్మెంట్ తరువాత గాలికి వదిలేయడం ఎంతవరకు న్యాయం? జీవితాంతం సమాజానికి సేవలు చేసే ప్రొఫెసరుకు రిటైర్ అయ్యాక కనీసం పెన్షన్ కూడా లభించకపోవడం శోచనీయం. అందుకే, ప్రభుత్వాలు యూనివర్సిటీలలో పనిచేసే ప్రొఫెసర్లకు కనీస పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి. అలాగే, రిటైర్ అయిన ప్రొఫెసర్లకు అందవలసిన బెనిఫిట్స్ కూడా సరైన సమయానికి అందడం లేదు.
పనిచేయని ‘యూనివర్సిటీ క్లినిక్’లు
కొన్ని పబ్లిక్ యూనివర్సిటీల ప్రొఫెసర్లకు ‘హెల్త్ కార్డు’లు లేక, ఆర్యోగ సమస్యలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఎప్పటినుంచో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ‘హెల్త్ కార్డ్స్’ ఇస్తామని చెప్పినప్పటికీ ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఇతర ప్రజానీకం మాదిరి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులుగాని, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే హెల్త్ కార్డులుకానీ యూనివర్సిటీల అధ్యాపకులకు వర్తించవు.
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ బిల్లులు చెల్లించడానికి అప్పులపాలు అవుతున్నారు కొంతమంది ప్రొఫెసర్లు. కొన్ని పబ్లిక్ యూనివర్సిటీల్లో కనీసం ‘యూనివర్సిటీ క్లినిక్’ లు కూడా సక్రమంగా నడవడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సెంట్రల్ యూనివర్సిటీలలో డీఏ, మెడికల్ రియింబర్స్మెంట్వంటివి రెగ్యులర్ గా చెల్లిస్తుంటారు.
కానీ, స్టేట్ యూనివర్సిటీలలో మాత్రం డీఏ, ఇతర సంక్షేమ కార్యక్రమాల చెల్లింపులలో కాలయాపన జరుగుతోంది. పబ్లిక్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ ల అసోసియేషన్ ఎలక్షన్ కూడా జరగడం లేదు. పబ్లిక్ యూనివర్సిటీలలో ఉన్న సమస్యలలో మరొకటి పనిభారం. కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలలో కొంతమేర రెగ్యులర్ నియామకాలు జరుగుతున్నప్పటికీ స్టేట్ యూనివర్సిటీలలో నియామకాలు జరగడం లేదు.
పెరుగుతున్న పనిభారం
మన రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో 2,878 మంది ప్రొఫెసర్లకుగాను కేవలం 753 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కేవలం 26 శాతం మంది మాత్రమే యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో 1,267 మంది ప్రొఫెసర్లకుగాను 331 మంది పనిచేస్తున్నారు. వాస్తవానికి యూనివర్సిటీలలో రీసెర్చ్, ప్రాజెక్ట్స్, ఇన్నోవేషన్స్, పాలసీ రూపకల్పనవంటి టీచింగేతర పనులు కూడా కీలకమైనవి. స్టేట్ యూనివర్సిటీలలో తగిన సంఖ్యలో పర్మినెంట్ ప్రొఫెసర్లు లేకపోవడం వలన ఆ భారం ఇతర అధ్యాపకులపై పడుతోంది.
ఉన్న కొద్దిపాటి ప్రొఫెసర్లు కూడా ఇతర బాధ్యతలు నిర్వహిస్తుండటం వలన యూనివర్సిటీలో పరిశోధనలు, ప్రాజెక్ట్ లు, ఇన్నోవేషన్స్ వంటివి అటకెక్కాయి. ప్రైవేట్ యూనివర్సిటీలతో పోల్చితే పబ్లిక్ యూనివర్సిటీలో రీసెర్చ్, ప్రాజెక్ట్ వంటివి తగిన స్థాయిలో లేవు. ఫలితంగా 'న్యాక్' గ్రేడ్, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటించే ర్యాంక్‌ల్లో పబ్లిక్ యూనివర్సిటీలకు సరైన ర్యాంక్ లభించడం లేదు. యూనివర్సిటీలలో రీసెర్చ్ నాలెడ్జ్ కలిగిన యువతను నియమిస్తే పరిశోధనలు, ప్రాజెక్టులపరంగా యూనివర్సిటీలు ముందుకు నడుస్తాయి. ప్రస్తుత సీనియర్ ప్రొఫెసర్లపై భారం తగ్గుతుంది.
ప్రొఫెసర్ల సంక్షేమాన్ని పరిరక్షించాలి
ప్రభుత్వాలు ఇకనైనా స్టేట్ యూనివర్సిటీల ప్రొఫెసర్ ల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమంపై దృష్టి పెట్టాలి. పబ్లిక్ యూనివర్సిటీలలో నాణ్యత పెంచాలంటే ముందుగా అక్కడి పనిచేస్తున్న ప్రొఫెసర్ల సంక్షేమంపై దృష్టి పెట్టాలి.
మన రాష్ట్రంలో ప్రొఫెసర్ ల సమస్యలపై ముఖ్యమంత్రికి సానుకూల దృక్పతం ఉన్నప్పటికీ అది పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావాలి. ఇటీవల రాష్ట్ర విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ ల రిటైర్మెంట్ వయస్సును కేంద్ర విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లతో సమానంగా 65 ఏళ్లకు పెంచిన విషయం మరువరాదు.
ముఖ్యంగా మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు తగిన సంక్షేమ కార్యాక్రమాలు గనుక రాష్ట్ర ప్రభుత్వం అందించగలిగితే అది అంతిమంగా తెలంగాణలో మానవవనరుల సృష్టి, నాణ్యతకు దారి తీస్తుంది. కేవలం ఉన్నత విద్యను బలోపేతం కోసం నూతన కోర్స్ లు ఏర్పాటు చేయడమే కాకుండా, ఉన్నత విద్యను బోధించే అధ్యాపకుల సంక్షేమం పరిరక్షించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు సులువుగా చేరుకోవచ్చు.
- ప్రొఫెసర్ చెన్నప్ప దాసరి,కామర్స్ డిపార్ట్మెంట్, ఉస్మానియా వర్సిటీ -
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
