జూనియర్ కాలేజీలు ఏమాయే..బెల్లంపల్లి నియోజక వర్గంలోని..ఏడాది క్రితమే మంజూరైనా.. ఏర్పాటులో జాప్యం

జూనియర్ కాలేజీలు ఏమాయే..బెల్లంపల్లి నియోజక వర్గంలోని..ఏడాది క్రితమే మంజూరైనా.. ఏర్పాటులో జాప్యం
  •     నెన్నెల, తాండూరు మండలాలకు జూనియర్  కాలేజీలు మంజూరు
  •     ఏటా 1,500 మంది విద్యార్థులకు తప్పని తిప్పలు

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల విద్యార్థులకు ఇంటర్  విద్య అందని ద్రాక్షగా మిగిలింది. తాండూరు, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాల్లో ప్రభుత్వ జూనియర్  కాలేజీలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది తాండూరు, నెన్నెల మండలాలకు జూనియర్  కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్  బోర్డ్  అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 

అయితే నేటి వరకు కాలేజీలు ప్రారంభం కాలేదు. తాండూరులో 4, వేమనపల్లిలో 3, నెన్నెలలో 8, కన్నెపల్లిలో 4, భీమినిలో 4 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ మండలాల్లో 1,500 మందికి పైగా విద్యార్థులు టెన్త్​ చదువుతున్నారు. ఆ తరువాత ఇంటర్​ చదివేందుకు వీరికి అవకాశం లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక 10 నుంచి 20 శాతం మంది విద్యార్థులు పదో తరగతికే పరిమితం అవుతున్నారు.

బెల్లంపల్లి, మంచిర్యాలకు వెళ్లాల్సిందే..

నియోజకవర్గంలోని వేమనపల్లి, నెన్నెల  మండలాల్లో మారుమూల గ్రామాలున్నాయి. దీంతో ఇక్కడి విద్యార్థులు చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలోని గవర్నమెంట్  జూనియర్​ కాలేజీకి వెళ్లాల్సి వస్తోంది. భీమిని, కన్నెపల్లి, తాండూరు మండలాల స్టూడెంట్లు బెల్లంపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్​ జూనియర్​ కాలేజీలకు వెళ్లడానికి తిప్పలు పడుతున్నారు.

ప్రారంభం కాని కొత్త కాలేజీలు..

తాండూరు, నెన్నెల మండలాలకు జూనియర్​ కాలేజీలను మంజూరు చేస్తూ గత ఏడాది జనవరి 27న ఇంటర్మీడియట్​ బోర్డ్​ డైరెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఆయా మండలాల్లో కాలేజీల ఏర్పాటుకు సరైన వసతులు లేకపోవడంతో ప్రారంభం కాలేదు. ఈ ఏడాది కూడా విద్యార్థులు ఇంటర్​ విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాలేజీలు ప్రారంభించేందుకు మండల  అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..

తాండూరు, నెన్నెల, వేమనపల్లి మండలాలకు జూనియర్​ కాలేజీలు మంజూరయ్యాయి. కలెక్టర్​ మండలాల్లో కాలేజీలకు భూములు కేటాయించారు. కాలేజీల ప్రారంభానికి కార్పస్​ ఫండ్​ చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలోని 100 హైస్కూళ్లను జూనియర్​ కాలేజీలుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కాలేజీలను ప్రారంభించలేదు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిఉంది.

 కె. అంజయ్య, డీఐఈవో, మంచిర్యాల

విద్యార్థులు తిప్పలు పడుతున్రు..

బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, తాండూరు, వేమనపల్లి, కన్నెపల్లి, భీమిని మండలాల్లో జూనియర్​ కాలేజీలు లేకపోవడంతో గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు చదువుకు దూరమవుతున్నారు. నెన్నెల, తాండూరు, వేమనపల్లి కాలేజీలను వెంటనే ప్రారంభించాలి.

బి.శ్రావణ్, బీఆర్ఎస్వీ​జిల్లా అధ్యక్షుడు