తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళదామనుకున్నారు! కానీ ఆయనకు అదో చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఇపుడు రెండో ముఖ్యమంత్రి కూడా 8 ఏండ్ల తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళతానంటున్నారు. కాకపోతే రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది స్వతహాగా జాతీయ పార్టీ కాబట్టి, ఆయన వాదనను సాంకేతికంగా కొట్టేయలేం కానీ, పరిస్థితులు మాత్రమే సాధ్యాసాధ్యాలను నిర్ణయిస్తాయి.
కాకపోతే, తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశించిన బాధ్యతలను నెరవేర్చగలిగితేనే ఆయన జాతీయ రాజకీయాల కల సాకారానికి అవకాశాలు ఉండొచ్చు. మిగులు రాష్ట్రానికి కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. రూ.7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రాన్ని రెండో ముఖ్యమంత్రికి అప్పగించిపోయారు. ఇదేం రేవంత్‌రెడ్డికి పూలపాన్పు పాలన కాదు! ఇలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్‌రెడ్డి జాతీయ రాజకీయాల కలలు కనేముందు ఆయన
చేయాల్సిన పనులు మాత్రం చాలా ఉన్నాయి.
ప్రజలు చూసేది..
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేసి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు పట్టంకట్టారో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదనుకోలేం. కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ పాలనగా మారడం, ప్రజాసంబంధాలు లేకపోవడం, చేసిన అభివృద్ధి అనర్థంగా మారడం, భారీ ప్రాజెక్టులలో కమీషన్ల ఆరోపణలు రావడం వగైరా.. కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచిన పరిణామమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి దోహదం చేశాయి. రేవంత్ ప్రభుత్వంలో ప్రజలు చూసేది కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలకు పరిష్కారాలు ఏమైనా దొరికాయా లేదా అనే!
పూడ్చలేని భారం
తెలంగాణ వచ్చిన మొదటి పదేండ్లలో రాజకీయాలు అవినీతి ఆరోపణలకే పరిమితం కాలేదు. అక్రమాలు, ఆక్రమణలు, ఈ రేస్‌లు, ఫోన్టాపింగ్లు ఇలా అనేకం విన్నాం.
కేసీఆర్ పాలనలో ప్రభుత్వమంటే ఆయనే అనేది అప్పట్లో ప్రజలు సైతం ఫిక్సయిపోయారు. కేసీఆర్ శైలినే పాలనగా భావించారు. కేసీఆర్ పాలన రెండు నగదు పథకాలు, నాలుగు ఎగనామం పథకాలతో సాగిపోయింది. ఓటు సంక్షేమం మొదటిది, ప్రజల సంక్షేమం చివరిది. తమ సంక్షేమం అసలుది. శాశ్వత అభివృద్ధిలోనూ అదే జరిగింది.
కేసీఆర్ పరిపాలన ఒరవడిలో అప్పులు పెరిగినంత ఆస్తులు పెరగలే. జరిగిన అభివృద్ధి సైతం బారానా దండగే అని కాళేశ్వరం ప్రాజెక్టే చెప్పింది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి
రూ. 7 లక్షల కోట్ల అప్పులు, పిల్లర్లు కుంగిన మేడిగడ్డ, సగంలోనే వదిలేసిన పాలమూరు, గుదిబండ లాంటి యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లు.. ఏదీ సంపూర్ణంగా పనికొచ్చిందిలేదు. కట్టిన వాటిని కూల్చేయలేం. అలా అని వాటి బరువును మోయలేం.
తెల్ల ఏనుగులను మేపడం, వాటితో ఏమైనా ఉపయోగం ఉంటే వాడుకోవడం తప్ప.. రెండున్నరేండ్లుగా రేవంత్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక, ఏం చేయాలో ప్రజలకు చెప్పలేని పరిస్థితే! అందుకు రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏం చేయగలుగుతోంది? అనే కీలక ప్రశ్నలకు జవాబులు చూపగలిగితేనే ఆయన జాతీయ రాజకీయాల కలకు అర్థం, పరమార్థం దక్కొచ్చు!
దర్యాప్తుల ఫలితమేది?
ఒకసారి రేవంత్‌రెడ్డి.. ‘నన్ను కోసినా ఒక్క రూపాయి లేదు’ అన్నమాట చిన్నదికాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు. అది వాస్తవమే. కానీ పరిష్కారం వెదకక తప్పదు మరి! కేసీఆర్ పోతూపోతూ లక్షల కోట్లలో అప్పులిచ్చిపోయాడు. మరోవైపు రేవంత్ రెడ్డి వందల సంఖ్యలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాడు.
సర్కారు ఖజానాలో నోట్ల బలం లేకున్నా.. పాలనలో మాటల బలం ఉంటే చాలు అని రేవంత్ అనుకుంటున్నట్లుంది! డబ్బులు ఊరికే రావు అనే టీవీ అడ్వర్టయిజ్మెంట్ కామెంట్ ఫాలో కావాలి మరి! అందుకు మార్గాలు లేవని కాదు.
కేసీఆర్ హయాంపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలపై ఇప్పటికే చాలానే దర్యాప్తులు జరిగాయి. కానీ ఏదీ బహిర్గతం అయినట్లు లేదు. వాటిపై ఓ కేసు పెట్టినట్లు, శిక్షలు పడినట్లు, అవినీతి సొమ్ము రికవరీ జరిగినట్లు ఎక్కడా లేదు! ఖజానా ఊరికే నిండదు! పాలకులు అవినీతి చేసిపోతే, ప్రజలపై మరిన్ని పన్నులు వేయడమే ప్రభుత్వాల పనా? ఇదే నిజమైతే, ప్రజాప్రభుత్వం అని ప్రజలు ఎలా అనుకునేది? ఆలోచించాల్సింది రేవంత్ రెడ్డే!
భిన్నంగా వ్యవహరించాలి
రేవంత్ రెడ్డి తమది ప్రజాప్రభుత్వం అంటున్నారు. నిజమే కేసీఆర్ లాంటి ఏకవ్యక్తి పాలన వద్దనుకునే ప్రజలు తమను ఎన్నుకున్నారనే భావనతోనే ఆయన తమది ప్రజాప్రభుత్వం అంటున్నారనుకోవచ్చు. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు! కానీ, ప్రజలు అడగని హామీలు వందల సంఖ్యలో ఇచ్చి తప్పు చేశామనే పశ్చాత్తాపం రేవంత్ రెడ్డికి కూడా ఉండాలి మరి!
అప్పట్లో కేసీఆర్ ఏమనేవాడంటే.. ఫలానా పథకం ఇవ్వాలని నాకు ఎవరూ దరఖాస్తు పెట్టుకోలే, అయినా ఫలానా పథకం ఇస్తున్నామని! కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో చాలామేరకు అమలుకు నోచుకోలేదనే విషయాన్ని మరిపించడానికే ఆయన కొత్త విషయం చెప్పేవాడు! కేసీఆర్‌లో ఉన్న గొప్ప తాంత్రిక తెలివి అదేనని అప్పట్లో ప్రశంసించినవారు కూడా ఉన్నారు! కానీ, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ స్టైల్ నేర్చుకుంటే మాత్రం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం అంత సులభం కాకపోవచ్చు! అందుకే రేవంత్ రెడ్డి కేసీఆర్ స్టైల్‌కు భిన్నంగా వ్యవహరిస్తేనే మేలు!
12 ఏండ్లలో ఏదీ నెరవేరలేదు!
తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే అని చెప్పుకోవడం ఒక పొలిటికల్ డైలాగ్‌లా మారిపోయింది. పదేండ్లలో కేసీఆర్ వాటిలో ఏ ఒక్కటీ సాధించింది లేదు. మరి రేవంత్‌రెడ్డి సీఎంగా వాటిని మెరుగ్గా అమలు చేస్తారనే ప్రజలు ఆశిస్తారు.
కృష్ణానది నుంచి పక్క రాష్ట్రం నీళ్ల దోపిడీ కేసీఆర్ హయాంలో ఆగలేదు, రేవంత్ ప్రభుత్వ హయాంలోనూ ఆగడం లేదు. పక్క రాష్ట్రంలోని పార్టీలతో (కేసీఆర్‌కు, రేవంత్‌కు) ఉన్న స్నేహ ప్రభావం మన నీళ్లపై పడుతోందని 12 ఏండ్లుగా మన అనుభవాలు చెపుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
కేసీఆర్ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇపుడు బనకచర్ల, నల్లమల సాగర్ల పేర్లు వినబడుతూనే ఉన్నాయి. కృష్ణానదిపై మన పెండింగ్ ప్రాజెక్టులు ఇప్పటికీ అలాగే నీలుగుతున్నాయి. మరి నీళ్ల పరిష్కారమేది? నిధులు, ఆస్తులు, అప్పుల పంపకాల్లో మొదటి సీఎంగా కేసీఆర్ అన్నిటికీ తల ఊపారు తప్ప పోరాడిందేం లేదు.
ఇక నియామకాల సంగతి చూస్తే, మరింత ఘోరం. ప్రభుత్వంలో తెలగాణ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో కేసీఆర్ ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వ సీఎంగా రేవంత్ రెడ్డి అయినా పట్టించుకుంటున్నారా? తెలంగాణ తెచ్చుకున్నది స్వయం పాలన కోసం అనడమే తప్ప, సెక్రటేరియట్ లాంటి చోటనే మన ఉద్యోగులు 80శాతం లేకపోతే, అదేం స్వయం పాలన? తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినా..నీళ్లు, నియామకాలను పట్టించుకోవాలనే కదా ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది?
తెలంగాణ తలరాత మారిస్తేనే..
2034 తర్వాత రేవంత్ జాతీయ రాజకీయాల్లోకి వెళతానంటున్నారంటే..మొత్తం పదేండ్లు తెలంగాణకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు. అయితే, 2028లో మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలో రేవంత్ రెడ్డి చేస్తున్నాడా? చేయగలడా? అనే ప్రశ్నలు మాత్రం ఆయన్ను వెంటాడుతాయని మర్చిపోవద్దు. ఒక పొలిటీషియన్ తన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తప్పుకాదు.
కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఆయన. .. మరిన్ని అప్పులు పెంచి పరిపాలించడం పెద్ద సమస్య కాదు. కానీ, ప్రభుత్వాలు మారినా మారని తెలంగాణ తలరాత మారేదెలా అనేదే ప్రజలను వేధిస్తూ వస్తున్న ప్రశ్న. రేవంత్ రెడ్డి దానికి పరిష్కారం చూపాలంటే.. ఇప్పటికైనా నీళ్లలో న్యాయం, తెలంగాణ కలలు కన్న స్వయంపాలన సాధించి, అప్పులను అభివృద్ధిగా మార్చి, జరిగిన అవినీతిని రికవరీ చేయగలిగితే.. నిజంగా జాతీయ రాజకీయాల్లో 8 ఏండ్లలో రేవంత్ రెడ్డి వెలిగిపోవడం సాధ్యమే! కానీ ఆ పని చేయగలడా అనేదే కదా చూడాల్సింది!
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
