- ఆటోమేటెడ్ విధానంలో నిరంతరాయంగా పర్యవేక్షణ
- వివాదాస్పద, విద్వేష పోస్టులకు చెక్
- సైబర్ బుల్లింగ్, డ్రగ్స్, మహిళల భద్రతపై ప్రత్యేక నిఘా
- సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ‘యూనిక్ ట్రాకింగ్ నంబర్’
- దర్యాప్తునకు ఆధునిక టూల్స్ అనుసంధానం
- వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్
బషీర్‌బాగ్, వెలుగు: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ పోలీస్ విభాగం మరో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. సామాజిక మాధ్యమాల్లో జరిగే తప్పుడు ప్రచారాలు, విద్వేష పూరిత పోస్టులపై నిఘా పెట్టేందుకు ఏఐ ఆధారిత “సాక్ ఐ”(సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్) వ్యవస్థను ప్రారంభించినట్లు సిటీ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.
గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణ కోసం భారీగా సిబ్బంది అవసరమయ్యేదని, గంటల తరబడి మాన్యువల్‌గా విశ్లేషణ చేయాల్సి వచ్చేదని తెలిపారు. అయితే “సాక్ ఐ” ద్వారా ఇకపై అన్ని ప్రక్రియలు ఆటోమేటెడ్ విధానంలో నిరంతరాయంగా జరుగుతాయన్నారు. డయల్-100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో చోటుచేసుకునే ప్రధాన ఘటనలను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో సమీకరించి అధికారులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించేలా వ్యవస్థ రూపొందించామని పేర్కొన్నారు.
విద్వేష పూరిత పోస్టుల గుర్తింపు
ప్రయోగాత్మక దశలోనే ఈ వ్యవస్థ తన సమర్థతను నిరూపించుకుందని సీపీ తెలిపారు. ఈ ఏడాది పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించిన 85 ద్వేషపూరిత, మతపరంగా సున్నితమైన పోస్టులను, గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించిన 126 సోషల్ మీడియా పోస్టులను ఈ వ్యవస్థ గుర్తించిందని వెల్లడించారు. ఇలా విద్వేషాలను ప్రేరేపించే వారిని సకాలంలో గుర్తించడం సాధ్యమైందన్నారు. మహిళల భద్రత, డ్రగ్స్ సరఫరా, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలపై కూడా ఈ వ్యవస్థ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఏఐ మోడల్స్ పోస్టుల తీవ్రతను బట్టి హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తాయని చెప్పారు.
యూనిక్ ట్రాకింగ్‌తో ఫిర్యాదుల పరిష్కారం
వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే ఖాతాలు, వాటిని వైరల్ చేసే నెట్‌వర్క్‌లను కూడా “సాక్ ఐ” సులభంగా గుర్తిస్తుందని సజ్జనార్ తెలిపారు. ప్రజల నుంచి సోషల్మీడియాల ద్వారా వచ్చే ఫిర్యాదులకు యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, పరిష్కారం అయ్యే వరకు ఎండ్- టు- ఎండ్ మానిటరింగ్ నిర్వహిస్తుందని చెప్పారు. నగరంలో జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపులపై ముందస్తు నిఘా ఉంచేందుకు ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో పొందుపరిచినట్లు వెల్లడించారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను విశ్లేషిస్తూ, ఎలాంటి ముప్పు తలెత్తినా వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుందని వివరించారు.
సైబర్ నేరాల దర్యాప్తు మరింత వేగవంతం
అలాగే SOCMINT, OSINT వంటి ఆధునిక ఇన్వెస్టిగేషన్ టూల్స్‌ను ఈ వ్యవస్థలో అనుసంధానం చేయడంతో సైబర్ నేరాల దర్యాప్తు మరింత వేగవంతం కానుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్, కీవర్డ్స్ ఆధారంగా ప్రజాభిప్రాయాలను, వివిధ కథనాలను తక్షణమే విశ్లేషించే సామర్థ్యం కూడా ఈ వ్యవస్థకు ఉందన్నారు. అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన “సాక్ ఐ” వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని సీపీ వీసీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
