బీసీసీఐ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఐ పరిధిలోకి రాదు: సీఐసీ

బీసీసీఐ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఐ పరిధిలోకి రాదు: సీఐసీ

న్యూఢిల్లీ: బీసీసీఐ సమాచార హక్కు చట్టం (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఐ) పరిధిలోకి రాదని కేంద్ర సమాచార కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఐసీ) స్పష్టం చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోగానీ, నియంత్రణలోగానీ లేదని, గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎలాంటి నిధులు దానికి అందవని వెల్లడించింది. పారదర్శకత చట్టం ప్రకారం ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పాల్సిన పని లేదని ప్రకటించింది. ఈ మేరకు 2018లో  తాము ఇచ్చిన పాత ఉత్తర్వులను కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు చేసింది.

క్రికెట్ పరిపాలన, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఇండియా ప్రాతినిధ్యం వంటి ముఖ్యమైన ప్రజా విధులను బీసీసీఐ నిర్వహిస్తున్నప్పటికీ.. దీనిని ప్రభుత్వ సంస్థగా పరిగణించలేమని సమాచార కమిషనర్ పి.ఆర్. రమేష్ పేర్కొన్నారు. ఈ సంస్థపై ప్రభుత్వానికి ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని, నిధులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఐ చట్టం సెక్షన్ 2(హెచ్) ప్రకారం బీసీసీఐని 'పబ్లిక్ అథారిటీ'గా వర్గీకరించలేం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్ట నిబంధనలు దానికి వర్తించవు. తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన బీసీసీఐ (1928) ఒక ప్రైవేట్, స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది రాజ్యాంగం ద్వారా గానీ, పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ చట్టాల ద్వారా గానీ ఏర్పడలేదు. మీడియా హక్కులు, స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఒప్పందాలు, టికెట్ల విక్రయాలు, బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్టింగ్, వాణిజ్య కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈ సంస్థ స్వతంత్రంగా నడుస్తోంది.

జాతీయ జట్లను ఎంపిక చేయడం, దేశంలో క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియంత్రించడం వల్ల ఇది ప్రభుత్వ సంస్థ కాజాలదు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఐ చట్టం ప్రకారం 'ప్రజా విధులు నిర్వర్తించడం' అనేది ప్రభుత్వ సంస్థగా గుర్తించడానికి ప్రాతిపదిక కాదు’ అని సీఐసీ పేర్కొంది. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్ వంటి దేశాల్లోని ప్రధాన క్రికెట్ బోర్డుల తరహాలోనే బీసీసీఐ కూడా నడుస్తోంది.