భద్రాద్రి కొత్తగూడెం జీజీహెచ్‌‌కు..కొరతల రోగం!

భద్రాద్రి కొత్తగూడెం జీజీహెచ్‌‌కు..కొరతల రోగం!
  • క్యాజువాలిటీలో డాక్టర్లు.. స్పెషలిస్టులు లేక రోగుల ఇబ్బందులు
  • రేడియాలజిస్టులు, అనస్థీషియా వైద్యుల కొరతతో స్కానింగ్‌‌లు, సర్జరీలకు అంతరాయం
  • ఉన్న డాక్టర్లపై పని ఒత్తడితో వైద్య సేవలు అస్తవ్యస్తం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఏజెన్సీ జిల్లాగా పేరున్న భద్రాద్రి కొత్తగూడెంలోని గవర్నమెంట్​ జనరల్​ ఆస్పత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలు దారుణంగా మారాయి. ఎమర్జెన్సీలో కీలకమైన క్యాజువాలిటీలో రెగ్యులర్​ డాక్టర్లు లేకపోవడం, స్పెషలిస్టుల కొరత, రేడియాలజిస్టుల లేమితో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, అత్యవసర కేసులతో వచ్చే రోగులు ఇక్కడి పరిస్థితులు చూసి ప్రైవేట్​ఆస్పత్రుల బాట పడుతున్నారు.  

క్యాజువాలిటీలో రెగ్యులర్​ డాక్టర్లు కరువు.. 

ప్రజలకు అత్యవసర వైద్యం అందించాల్సిన క్యాజువాలిటీ విభాగం కొత్తగూడెం జీజీహెచ్​లో పేరుకే నడుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓపీ సేవలు నిలిచిపోతుండడంతో ఎమర్జెన్సీ కేసులన్నీ క్యాజువాలిటీకి వస్తున్నాయి. అయితే, అక్కడ రెగ్యులర్​గా పని చేసే డాక్టర్లు ఒక్కరూ లేకపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రస్తుతం ఇతర విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లను అవసరానికి అనుగుణంగా డ్యూటీలు వేస్తూ నెట్టుకొస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోజూ సూసైడ్స్, యాక్సిడెంట్స్​తోపాటు ఇతర అత్యవసర కేసులు ఎక్కువగా వస్తున్నాయి. రోజుకు దాదాపు 50కిపైగా రోగులు క్యాజువాలిటీ సేవలు పొందుతున్నారు. నర్సింగ్ ఆఫీసర్లే అధికంగా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి నెలకొన్నది.  

రేడియాలజిస్టుల కొరతతో స్కానింగ్‌‌లకు ఇబ్బందులు..

జీజీహెచ్​లో రేడియాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. స్కానింగ్​ కోసం వచ్చే రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొందరు ప్రైవేట్​ స్కానింగ్​ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. రేడియాలజిస్టు విభాగంలో రెండు అసోసియేట్​ ప్రొఫెసర్​ పోస్టులు, ఐదు అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల నియమితుడైన ఒక్క రేడియాలజిస్టుపైనే మొత్తం భారం పడింది. ఒక రోజు జీజీహెచ్​లో విధులు నిర్వహిస్తే, మరో రోజు మెడికల్​ కాలేజీలో భాగమైన రామవరం మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో సేవలు అందించాల్సి వస్తోంది. దీంతో బ్రెస్ట్​ క్యాన్సర్​ పరీక్షల కోసం వచ్చే మహిళలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

పేషంట్​ కేర్​ సిబ్బందితో ఎక్స్​రేలు..

ఆస్పత్రిలో ఎక్స్​రే టెక్నీషియన్లు లేకపోవడంతో రోజుకు 50 నుంచి 100 వరకు ఎక్స్​రేలు తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ రాధామోహన్​ పేషెంట్​ కేర్​ సిబ్బందిలో కొందరికి శిక్షణ ఇచ్చి ఎక్స్​రేలు తీయిస్తున్నారు. అయితే, రిపోర్టుల ఖచ్చితత్వంపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సీటీ స్కాన్​ యంత్రం ఉన్నా నిర్వహణకు సిబ్బంది లేకపోవడంతో సేవలు సరిగా అందడం లేదు.  

అనస్థీషియా వైద్యుడు ఒక్కరే.. తగ్గిన ఆపరేషన్లు

సర్జరీలకు కీలకమైన అనస్థీషియా డాక్టర్​ ఒక్కరే ఉండడంతో ఆస్పత్రిలో సర్జరీలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం అత్యవసర శస్ర్తచికిత్సలకే పరిమితమవుతున్నారు. దీంతో రోగులు ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

పని ఒత్తిడితో సతమతం.. 

జీజీహెచ్​లో డాక్టర్ల కొరత కారణంగా ఉన్న వైద్యులపై పని భారం పెరిగింది. రోజూ 600 నుంచి 800 వరకు ఓపీ నమోదవుతోంది. ఓపీతోపాటు వార్డుల్లో చికిత్స, ఎమర్జెన్సీ కేసులు చూసుకోవాల్సి రావడంతో ఒత్తిడి ఎదురవుతోందని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని, అయినా అందుబాటులో ఉన్న సిబ్బందితో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని జీజీహెచ్​ సూపరింటెండెంట్​రాధామోహన్​తెలిపారు.  

కీలక విభాగాల డాక్టర్ల కొరత.. 

కొత్తగూడెం జీజీహెచ్​లో స్పెషలిస్ట్​ డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మెరుగైన వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన చికిత్స అందక ప్రైవేట్​ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ వేలల్లో డబ్బులు చెల్లిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. కాగా, ఆస్పత్రిలో అసోసియేట్​ ప్రొఫెసర్​ పోస్టులు 16 ఉండగా, ప్రస్తుతం నలుగురే పని చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్​ పోస్టులు 82 ఉండగా, 62 ఖాళీగా ఉన్నాయి. 

విభాగాల వారీగా ఖాళీలు..

  • జనరల్​ మెడిసిన్​ విభాగంలో 15 అసిస్టెంట్​ప్రొఫెసర్​ పోస్టుల్లో 10 ఖాళీగా ఉన్నాయి. మూడు అసోసియేట్ ప్రొఫెసర్​ పోస్టున్నీ ఖాళీయే. 
  • పీడియాట్రిక్​ విభాగంలో 8 పోస్టుల్లో 7 ఖాళీ. 
  •  జనరల్​ సర్జరీలో 15 పోస్టుల్లో 10 ఖాళీ. 
  • గైనకాలజీ విభాగంలో 15 పోస్టుల్లో 13 ఖాళీలే.
  • అనస్థీషియా విభాగంలో 15 పోస్టుల్లో 11 ఖాళీలే ఉండగా, రెండు అసోసియేట్​  ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.