ఈరోజుల్లో సినీ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్రాండెడ్ దుస్తులు, కోట్ల విలువైన విల్లాలు, విదేశీ ప్రయాణాలు.. ఇలా అంతా రాయల్ లుక్. మరీ ముఖ్యంగా నయనతార వంటి నేటితరం స్టార్ హీరోయిన్లు ప్రైవేట్ జెట్‌లలో తిరుగుతుంటే ఫ్యాన్స్ అబ్బురపడుతుంటారు. కానీ, అసలు సిసలు రికార్డు ఏమిటో తెలుసా? నేటి తరం భామల కంటే దాదాపు 40 సంవత్సరాల క్రితమే ఓ సౌత్ ఇండియన్ హీరోయిన్ సొంతంగా ప్రైవేట్ జెట్ కొని, అందులోనే షూటింగ్‌లకు వెళ్లేదట. ఆమె ఎవరో కాదు.. సీనియర్ నటి, ఒకప్పటి స్టార్ బ్యూటీ కేఆర్ విజయ (K. R. Vijaya).
షూటింగ్ కు సొంత విమానంలోనే..
దక్షిణాదిలో ప్రైవేట్ జెట్ ఉన్న మొదటి హీరోయిన్ నయనతార అని చాలామంది భావిస్తారు. కానీ, కేఆర్ విజయ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వ్యూల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సోదరి, నటి కేఆర్ వత్సల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన నిజాలు పంచుకున్నారు. కేఆర్ విజయ ఆ కాలంలోనే షూటింగ్‌ల కోసం సొంత విమానంలో ప్రయాణించేవారని, అంతేకాదు ఆమెకు సొంతంగా సరుకు రవాణా ఓడలు (Cargo Ships) , హోటల్స్ కూడా ఉండేవని తెలిపారు. అంతటి అపర కుబేరురాలైనప్పటికీ, ఆమె ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించలేదని వత్సల పేర్కొన్నారు. కేఆర్ విజయ కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ.. ముంబై, మధురై, కొచ్చి, బెంగళూరు, మంగళూరు వంటి నగరాలకు షూటింగ్స్ కోసం, పర్సనల్ ట్రిప్స్ కోసం తన సొంత ఫ్లైట్‌లోనే వెళ్లేదాన్ని అని అంగీకరించారు.
15 ఏళ్లకే ఎంట్రీ.. !
1963లో కేవలం 15 ఏళ్ల వయసులో 'కార్పగం' అనే తమిళ సినిమాతో కేఆర్ విజయ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆరు దశాబ్దాల పాటు దక్షిణాది సినిమాను ఆమె ఏలారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్ సరసన నటించి మెప్పించారు. ముఖ్యంగా 1970వ దశకంలో ఆమె సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా రికార్డు సృష్టించారు. అప్పట్లో ఆమె రెమ్యునరేషన్ టాప్ హీరోలతో సమానంగా ఉండేదట.
ఆమె అందమైన నవ్వుకు ఫిదా అయిన ప్రేక్షకులు ఆమెను “పున్నగై అరసి” (చిరునవ్వుల రాణి) అని పిలుచుకునేవారు. కేఆర్ విజయ ముఖంలో ఒక దైవిక కళ ఉండేది. అందుకే అప్పట్లో భక్తిరస చిత్రాల్లో దేవతల పాత్రల కోసం దర్శకుల మొదటి ఛాయిస్ ఆమెనే. తెలుగులో బాపు దర్శకత్వంలో వచ్చిన ఎన్నో పౌరాణిక చిత్రాల్లో, అలాగే బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ సినిమాలోనూ ఆమె అద్భుతంగా నటించారు. దాదాపు 500 పైగా చిత్రాల్లో నటించిన కేఆర్ విజయ, ఆ తర్వాత బుల్లితెరపై సీరియల్స్ ద్వారా కూడా భారత్, శ్రీలంక ప్రేక్షకులను అలరించారు. నాలుగు దశాబ్దాల క్రితమే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కేఆర్ విజయ లగ్జరీ లైఫ్ స్టోరీ.. ఇప్పటికీ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
