- లింక్ డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు
- ఆ స్థానంలో కేవలం అబ్జల్యూట్ ఓనర్ పేరుతో సరిపెడ్తున్న సబ్ రిజిస్ట్రార్లు
- డబ్బులిస్తే ఎవరి స్థలాలైనా ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్
- ఈ తప్పుడు డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు చేస్తున్న తహసీల్దార్లు
- ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్ల ఆక్రమణ
- కరీంనగర్, వరంగల్‌లో పలు ఘటనలు వెలుగులోకి..
హైదరాబాద్, వెలుగు: లింక్ డాక్యుమెంట్లు, పాస్ బుక్కులు లేకపోయినా భూములు రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. కేవలం ‘అబ్జల్యూట్ ఓనర్’ పేరుతో ఇతరుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న సబ్రిజిస్ట్రార్ల దందా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తాజాగా వెలుగులోకి వచ్చింది. లంచాలకు ఆశపడి అధికారులు చేస్తున్న ఈ రిజిస్ట్రేషన్ల ఆధారంగా.. తహసీల్దార్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్లు చేస్తూ కోట్ల విలువైన ఆస్తులను అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. ఈసీ, లింక్ రికార్డులు పరిశీలించకుండా సాగుతున్న ఈ భూదందా అసలైన యజమానులకు నిద్రలేకుండా చేస్తోంది. ఏదైనా ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయాలంటే లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి. ఆ లింక్ డాక్యుమెంట్ వివరాలను సేల్ డీడ్‌లోనూ పొందుపరచాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే ఒకరి నుంచి మరొకరికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకవేళ అది అగ్రికల్చర్ల్యాండ్ అయితే లింకు డాక్యుమెంట్స్థానంలో పట్టాపాస్‌బుక్ నంబర్తప్పక వేయాలి. కానీ కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఇలాంటివేవీ పట్టించుకోవడం లేదు. డబ్బులిస్తే చాలు.. ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా ఒకరి ప్రాపర్టీని మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. అమ్మకందారుకు ఈ ప్రాపర్టీ ఎలా వచ్చిందనే వివరాల దగ్గర కేవలం ‘అబ్జల్యూట్ ఓనర్’ అని రాసి డాక్యుమెంట్లు
రూపొందిస్తున్నారు.
స్టాంప్ డ్యూటీ చెల్లించి తమ కమీషన్చేతిలో పెడ్తే చాలు, లింక్ డాక్యుమెంట్లను పట్టించుకోకుండా సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఇలాంటి డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని తహసీల్దార్లు నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన భూములు అక్రమార్కుల చేతుల్లోకి పోతున్నాయి. ఇటీవల కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇలాంటి పలు ఘటనలు వెలుగు చూడడంతో ఎవరి ప్రాపర్టీకి గ్యారెంటీ లేకుండా పోయింది.
అక్రమ రిజిస్ట్రేషన్ ఆధారంగా అక్రమ మ్యుటేషన్.. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలో ఇన్నర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న కోట్ల విలువైన భూమి వ్యవహారమిది. ఖిలా వరంగల్ రెవెన్యూ పరిధిలో 2009 నుంచి 2019 వరకు ఉన్న పహాణి ప్రకారం సర్వే నంబర్ 683లో పి.చిన్నమల్లయ్య పేరిట 5.32 ఎకరాలు, సర్వే నంబర్ 682లో బిల్ల రాజమల్లు పేరిట 6 గుంటలు, సర్వే నంబర్ 684లో బిల్ల అయిలయ్య పేరిట 34 గుంటలు, సర్వే నంబర్ 685లో బిల్ల హన్మంతు పేరిట 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. వీరిలో పి.మల్లయ్య పేరిట స్థానికంగా ఎవరూ లేరు. దీంతో భూరికార్డుల ప్రక్షాళనలో పాస్ బుక్ జారీ కాలేదు. కాగా, 4 సర్వే నంబర్లలోని మొత్తం 7.01 ఎకరాల భూమిని 22 మంది కలిసి మరో 8 మందికి సేల్ డీడ్ ద్వారా 2019లో రిజిస్ట్రేషన్ చేశారు. సదరు 22 మందిని ‘అబ్జల్యూట్ ఓనర్’గా చూపారు. ఈ డాక్యుమెంట్ ద్వారా మ్యుటేషన్ చేసి తమకు పాస్‌బుక్స్ జారీ చేయాలని 8 మంది కొనుగోలుదారులు అప్పట్లోనే తహసీల్దార్‌ను ఆశ్రయించారు. అప్పటి తహసీల్దార్ రెవెన్యూ రికార్డులు, పహాణి పరిశీలిస్తే 683లోని 5.32 ఎకరాల భూమి పి.మల్లయ్య పేరిట నమోదై ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ఆయనతో సంబంధం లేని పేర్లు ఉండడంతో సదరు అమ్మకందారులు పి.మల్లయ్యకు వారసులు ఎలా అవుతారనే ప్రశ్న తలెత్తి మ్యుటేషన్ చేయలేదు. ఆ తర్వాత వరుసగా ముగ్గురు తహసీల్దార్లు మ్యుటేషన్ పెండింగ్‌లో పెడితే.. ఆ తర్వాత వచ్చిన తహసీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేసి, పాస్ బుక్స్ జారీ చేశారు.
కరీంనగర్‌లో ఖాళీ ప్లాట్లు ..
కరీంనగర్‌లో విలువైన ఖాళీ ప్లాట్లను గుర్తించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న ముఠా వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట రెవెన్యూ పరిధిలోని 212, 214 సర్వే నంబర్లలోని భూమిలో పట్టాదారులైన షేక్ అలీమా, షేక్ అహ్మద్ 1988 లో జీపీ లేఔట్ చేశారు. ఇందులో కొన్ని ప్లాట్లను అమ్మగా.. ఇంకా కొన్ని ప్లాట్లు మిగిలి ఉన్నాయి. కిన్నెర మల్లవ్వ, మర్రి వెంకట స్వామి, మొహమ్మద్ ఖలీదా బేగం, మొహమ్మద్ బబ్లూ, మాడిశెట్టి భాగ్యలక్ష్మి, కంది రవీందర్‌రెడ్డి, కొత్తూరి సదానందం తదితరులు కలిసి ఓ ముఠా ఏర్పడి ఈ ఖాళీ ప్లాట్లను గుర్తించి ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకుండా సుమారు 40 వరకు ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకరు చేసుకున్నాక తమ గ్రూపులోనే మరొకరికి సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయిస్తూ నాలుగైదు లింక్ డాక్యుమెంట్లు తయారయ్యాక అమ్మకానికి పెట్టేవారు. ఇలా కొందరికి అమ్మేశారు . కొన్ని ప్లాట్లపై ప్రైవేట్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. ఇందులో వారు ఫస్ట్ క్రియేట్ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ఎలాంటి లింక్ డాక్యుమెంట్‌ను ప్రస్తావించకుండా, ఆ ప్లాట్ అమ్మకందారుకు ఎలా వచ్చిందో చెప్పకుండా ‘అబ్జల్యూట్ ఓనర్’ అని మాత్రమే ప్రస్తావించారు. లింక్ డాక్యుమెంట్లు చూడకుండానే సబ్ రిజిస్ట్రార్లు తమ వాటా తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019, 2020 నుంచి నడస్తున్న ఈ దందా పట్టాదారుల ఫిర్యాదుతో ఇటీవల వెలుగుచూసింది. ఈ ముఠాలోని కొందరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
లేటెస్ట్ పహాణి, పాస్‌బుక్ ఉంటేనే అగ్రికల్చర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్..
భూరికార్డులు డిజిటలైజ్ అయ్యాక తహసీల్దార్ ఆఫీసుల్లో 2012లో వెబ్ ల్యాండ్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆన్ లైన్ పహాణిని చెక్ చేసేవారు. అందులో వివరాలు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసేవారు. ఆ తర్వాత భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా 2018లో ప్రభుత్వం పాత పాస్ బుక్స్ క్యాన్సిల్ చేసి కొత్త పట్టాదారు పాస్ బుక్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2018 మే నుంచి 2021 నవంబర్(ధరణి పోర్టల్ వచ్చే) వరకు అమ్మకందారుల కొత్త పాస్ బుక్స్ ఉంటేనే సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసేవారు. ఆ తర్వాత కొనుగోలుదారులు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేసుకుని కొత్త పాస్ బుక్స్ పొందేవాళ్లు. 2021లో ధరణి పోర్టల్ వచ్చాక స్లాట్ బుక్ చేసుకుంటే తహసీల్దార్ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కేవలం నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకే పరిమితమయ్యాయి. కానీ 2019లో కొత్త పాస్ బుక్స్ లేదా లేటెస్ట్ పహాణి లేకుండానే ఖిలా వరంగల్ పరిధిలో 22 మంది కలిసి కోట్లాది రూపాయల విలువైన భూమిని 8 మంది పేరిట రిజిస్ట్రేషన్ చేయడం, అది జరిగిన ఏడేండ్ల తర్వాత తహసీల్దార్ మ్యుటేషన్ చేయడం అనుమానాలకు తావిస్తోంది.
నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఇలా..
నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రిపేర్ చేసే సేల్ డీడ్‌లో పేర్కొన్న పాత లింక్ డాక్యుమెంట్లు, ఈసీని సబ్ రిజిస్ట్రార్లు క్షుణ్నంగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. వాటిని బట్టే అమ్మకందారుడికి ఆ ఆస్తిపై పూర్తి హక్కు ఉందా? లేదా? అని నిర్ధారించుకోవాలి. అది గతంలో వ్యవసాయ భూమి అయితే నాలా కన్వర్షన్ తర్వాత రెవెన్యూ శాఖ ఇచ్చే సర్టిఫికెట్ కూడా సబ్ రిజిస్ట్రార్ సరిచూడాల్సి ఉంటుంది. అప్రూవ్డ్ లే ఔట్ అయితే పట్టణాభివృద్ధి సంస్థ, మున్సిపాలిటీ, జీపీ అప్రూవ్డ్ ప్లాన్, నంబర్ సమర్పించాలి. అలాగే ఒక వేళ అది పాత ఇంటి స్థలం, ఇల్లు అయితే మున్సిపాలిటీ, జీపీకి చెల్లించిన ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్టులు జత చేయాలి. ఎన్నో ఏండ్లుగా అది వారసత్వంగా వచ్చిన ఆస్తి అయినప్పటికీ హక్కుదారుగా చెప్పేందుకు డాక్యుమెంట్ చూపాల్సి ఉంటుంది. కానీ కరీంనగర్‌లో ఎలాంటి ఆధారం లేకపోయినా, ఆ భూమితో సంబంధం లేకపోయినా ‘అబ్జల్యూట్ ఓనర్’ పేరుతో ఇతరుల భూమిని వేరొకరి పేరిట సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది.
8 మంది ఉంటే ఐదుగురిపైనే రిజిస్ట్రేషన్..
మరోవైపు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారమైనా మ్యుటేషన్ జరిగిందా? అంటే అదీ జరగలేదు. 8 మంది కొనుగోలుదారులు ఉంటే ఐదుగురి పేరిట మాత్రమే భూమిని మ్యుటేషన్ చేశారు. అది కూడా డాక్యుమెంట్ ప్రకారం ఆ ఐదుగురికి 2.39 ఎకరాలు మాత్రమే మ్యుటేషన్ చేయాల్సి ఉండగా.. 5.29 ఎకరాలు చేశారు. దీంతో మిగతా ముగ్గురికి సరిపడా భూమి లేకుండా పోయింది. కొనుగోలుదారుల మధ్య పంచాయితీతో అక్రమ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవహారం వెలుగుచూసింది. మ్యుటేషన్ ఫైల్‌ను చూసే జీపీవో, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ నుంచి డీటీ, తహసీల్దార్, ఆర్డీవో వరకు ఎవరూ అసలు పి.మల్లయ్య ఎవరనే విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారమంతా గతంలో ఇక్కడ డీటీగా, తర్వాత తహసీల్దార్‌గా ఉన్న రెవెన్యూ ఆఫీసర్ కనుసన్నల్లోనే నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లింక్ డాక్యుమెంట్ చెక్ చేశాకే రిజిస్ట్రేషన్లు చేయాలి..
రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకందారుల పేరు మీద టైటిల్ ఉందా? లేదా? అని సబ్ రిజిస్ట్రార్ తప్పకుండా చూడాలి. దీంతోపాటు కనీసం ఒక లింక్ డాక్యుమెంట్ లేదా పట్టాదారు పాస్ బుక్ చెక్ చేయాలి. అమ్మకందారుల పేర్లు, లింక్ డాక్యుమెంట్లలో ఉన్న పేర్లతో సరిపోల్చుకోవాలి. డబుల్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా? అనేది తెలుసుకు నేందుకు ఈసీ కూడా చెక్ చేయాలి. 22ఏ కూడా చెక్ చేసి అన్నీ సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది.
– గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్
