- ప్రతి నెలా చివరి రోజు అర్ధరాత్రి 12 గంటలకు వినియోగదారులకు బిల్లులు జారీ
- కస్టమర్ల ఈ మెయిల్ ఐడీకి చేరుతున్న బిల్స్ డిటైల్స్
- ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.2 వేల కోట్ల కరెంట్ బిల్లులు అందజేత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆటోమెటిక్ కరెంట్ బిల్లులు వచ్చేశాయ్. కరెంటోళ్లు గతంలో ఇంటికి వచ్చి నెల రోజుల పాటు ఉపయోగించిన కరెంట్‌ను మీటర్ రీడింగ్ చూసి బిల్లులు కొట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటికి రాకుండానే కరెంట్ బిల్లులు జనరేట్ అవుతున్నాయి. నెలాఖరు రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఒక నిమిషం అటు ఇటు కాకుండా కస్టమర్ ‘మెయిల్ ఐడీ’కి కరెంట్ బిల్లులు వచ్చేస్తున్నాయి. వినియోగదారులు ఆ బిల్లు చూసి డబ్బులు కట్టేస్తే సరిపోతుంది.
ప్రస్తుతం ఇది హై టెన్షన్(హెచ్‌టీ) కరెంట్ సర్వీస్ ఉన్నవాళ్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అది కూడా మే నెల నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లో మొదలైంది. తర్వాత ఎల్‌టీ కనెక్షన్లకు కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దక్షిణ డిస్కం పరిధిలోని 13,160 మంది హెచ్‌టీ వినియోగదారులకు ఏప్రిల్‌లో వినియోగించిన కరెంట్‌కు సంబంధించి ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) ద్వారా విజయవంతంగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన కరెంట్ బిల్లులు ఇచ్చేశారు. ఆ బిల్లుల ప్రకారం కరెంట్ చార్జీలను కూడా వసూలు చేస్తున్నారు.
అధికారులపై తగ్గిన పని భారం..
రాష్ట్రంలో 16 వేలకుపైగా హెచ్‌టీ విద్యుత్ వినియోగదారులు ఉండగా దక్షిణ డిస్కం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌లోనే 14,259 మంది ఉన్నారు. వీరంతా కూడా భారీ పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లకు చెందిన వాళ్లే. ఇవన్నీ 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ కనెక్షన్లే. ఈ కనెక్షన్లకు బిల్లులను సాధారణ మీటర్ రీడర్లు తీయరు. హెచ్‌టీ బిల్లింగ్ బాధ్యత డిస్కం ఇంజినీర్లదే. ప్రతి నెల రూ.కోట్లల్లో బిల్లులు వస్తుంటాయి.
అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్లు, డివిజినల్ ఇంజినీర్లు స్వయంగా వెళ్లి మీటర్ రీడింగ్ తీసి, బిల్లులను జారీ చేయాల్సి ఉంటుంది. వాస్తవంగా ఈ అధికారులు క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాను పర్యవేక్షించడం, సమస్యలను గుర్తించి పరిష్కరించే బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అలాంటిది ప్రతి నెలలో 12-, 13 రోజుల పాటు హెచ్‌టీ బిల్లుల జారీకే సమయం పోతున్నది. దీనివల్ల మిగతా పనులు పక్కదారి పడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే డిస్కం అధికారులు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ సిస్టమ్ విజయవంతంగా అమలు అవుతుండటంతో అధికారులకు పని భారం తప్పినట్లయ్యింది.
నెలలో చివరి రోజు అర్ధరాత్రి 12 గంటలకు బిల్లులు..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 14,259 హెచ్‌టీ సర్వీసుల మీటర్ వద్ద 4జీ మోడెంలను అమర్చి వాటిని దక్షిణ డిస్కం కార్పొరేట్ కార్యాలయంలోని బిల్లింగ్ సర్వర్‌తో అనుసంధానించారు. దీని ద్వారా మీటర్ రీడింగ్‌లో మనిషి ప్రమేయం లేకుండానే ప్రతి నెల చివరి తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఏఏంఆర్ సిస్టమ్ ద్వారా వినియోగదారుల ఈ మెయిల్ ఐడీకి కరెంట్ బిల్లు వెళ్లిపోతుంది. మే నెల ఫస్ట్ తారీఖు నాడు 13,160 మంది వినియోగదారులకు రూ.2 వేల కోట్లకు పైగా బిల్లులు అందించారు. ఈ సిస్టమ్‌లో మీటర్ డేటా సహాయంతో మీటర్లలో ఏదైనా లోపాలు ఉంటే వెంటనే గుర్తించి మీటర్లను మార్చడం ద్వారా వాణిజ్య నష్టాలను తగ్గిస్తారు. కరెంట్ బిల్లులు మెయిల్ ఐడీకి వచ్చిన 15 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే మీటర్ కనెక్షన్నుతొలగిస్తారు.
ఆటోమెటిక్ బిల్లుల జారీ సక్సెస్..
రాష్ట్రంలో తొలిసారిగా ఉపయోగించిన ఆటోమేటిక్ కరెంట్ బిల్లుల విధానం విజయవంతమైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన 14 వేలకు పైగా హెచ్‌టీ సర్వీసులకు మే నెలలో ఏఎంఆర్ విధానంలో బిల్లులు అందచేశాం. ఏప్రిల్ 30 అర్ధరాత్రి కస్టమర్ల మెయిల్ ఐడీలకు రూ.2 వేల కోట్ల విలువ చేసే కరెంట్ బిల్లులు పంపించాం. వీటి ఆధారంగా కస్టమర్లు బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ విధానాన్ని త్వరలో ఎల్‌టీ సర్వీసులకు కూడా ఇవ్వాలని భావిస్తున్నాం.
- జితేష్ వి.పాటిల్, దక్షిణ డిస్కం సీఎండీ, హైదరాబాద్-
