- అత్యవసరమైన ప్రాంతాల్లోనూ పూర్తి చేయట్లే
- వైడెనింగ్ చేయకుండానే శివారు ప్రాంతాల విలీనం
- ఇప్పటికీ పూర్తి కాక ట్రాఫిక్ కష్టాలు
- మరోవైపు హైరైజ్ బిల్డింగులకు హెచ్ఎండీఏ పర్మిషన్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు కార్పొరేషన్ల పరిధిలో రోడ్ల విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. కొన్నిచోట్ల అత్యవసరమైనప్పటికీ వెడల్పు పనులు జరగడంలేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది. మూడునెలల క్రితం శివారు మున్సిపాలిటీలను కలిపి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. శివారు మున్సిపాలిటీల్లో రోడ్ల విస్తరణ పనులు పెండింగ్లో ఉండగానే విలీనం చేశారు.
ఇప్పటికీ ఆ పనులు ఇంకా పూర్తి చేయలేదు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లలో పాత పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అస్సలే పట్టించుకోవడం లేదు. ఇక శివారు ప్రాంతాల నుంచి ఓఆర్ఆర్ తో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ కోసం లింక్ రోడ్లు నిర్మించాలని అనుకున్నా ఇప్పటికీ చేయలేదు.
ఓల్డ్ సిటీలో ముందుకు సాగని పనులు ..
ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ రద్దీగా ఉండే 12 రోడ్లను రూ.600 కోట్లతో వెడల్పు చేయాలని అనుకుని 2023లో ప్రారంభించారు. ఇందులో రెండు రోడ్లకి సంబంధించి ఆస్తుల సేకరణ మాత్రమే పూర్తయ్యింది. 43 ఏండ్ల కింద చార్మినార్ డెవలప్ మెంట్లో భాగంగా అప్పట్లో కొన్ని రోడ్లను వెడల్పు చేశారు. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు ఎక్కడా రోడ్ల విస్తరణ పనులు జరగలేదు. మూడేండ్ల కింద 20 నుంచి 40 ఫీట్లున్న రోడ్లను 60 నుంచి 80 ఫీట్ల దాక పెంచాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ 30 కిలోమీటర్ల మేర రోడ్ల వెడల్పు చేయాలని నిర్ణయించింది. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో ఒక్క పని కూడా జరగడం లేదు. చాంద్రాయణగుట్టలోని ఆజీం హోటల్ నుంచి చర్చి గేట్ వరకు (షోహెబ్ హోటల్ నుంచి బాలాపూర్ రోడ్) వరకు 80 అడుగుల వెడల్పు రోడ్డు విస్తరణ కోసం ఆస్తుల సేకరణ పూర్తయినా రోడ్లను నిర్మించలేదు.
విలీనమైన ప్రాంతాల్లోనూ అంతే...
మూడు కార్పొరేషన్లలో విలీనమైన బండ్లగూడ జాగీర్, ఘట్ కేసర్, కొత్తూరు , దమ్మాయిగూడ, నాగారం, బడంగ్ పేట్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మణికొండ, జవహర్ నగర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రూ. 1,250 కోట్లతో 103.45 కిలోమీటర్ల మేర లింక్ రోడ్లను నిర్మించాల్సి ఉంది. ఇందులో కొన్నింటికి సంబంధించి రోడ్ల వైడెనింగ్ చేయాలి. ఈ పనులు మూడేండ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉన్నా ఇప్పటికీ మొదలుపెట్టలేదు.
రోడ్లు లేకుండానే అనుమతులు
ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలోని బండ్లగూడ జాగీర్ (పాతబండ్లగూడ జాగీర్ కార్పొరేషన్) చౌరస్తా నుంచి కిస్మత్ పూర్ రోడ్డు వరకు వంద ఫీట్ల విస్తరణ పనులను మూడేండ్ల క్రితం చేయాలని అనుకున్నారు. భూ సేకరణ కోసం మార్కింగ్ కూడా వేశారు. కానీ, ఇప్పుడు చెట్లను తొలగించడం మొదలుపెడుతున్నారు. ఇంకా భూసేకరణ మిగిలే ఉంది. కానీ, ఇక్కడ 50 ఫ్లోర్ల హైరైజ్ భవనాలకు హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చేసింది. ఇప్పటికే ఈ రోడ్డు నుంచి లక్షలాది వాహనాలు పోతూ వస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చే నిర్మాణాలతో ట్రాఫిక్ మరింత పెరగనునన్నది. కానీ రోడ్లు పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
