ప్రతి ముగ్గురిలో ఒకరికి హైబీపీ..ఎక్సర్ సైజ్ లేకపోవడం, ఒత్తిడి, ఫుడ్ హ్యాబిట్సే కారణం 

ప్రతి ముగ్గురిలో ఒకరికి హైబీపీ..ఎక్సర్ సైజ్ లేకపోవడం, ఒత్తిడి, ఫుడ్ హ్యాబిట్సే కారణం 
  • సగం మందికి రక్తపోటున్న విషయమే తెలియదు  
  • లైఫ్​స్టైల్​లో మార్పులతోనే కంట్రోల్​ చేయొచ్చంటున్న డాక్టర్లు 

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్)తో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఏడాది ‘కంట్రోలింగ్ హైపర్‌‌‌‌ టెన్షన్ టు గెదర్ చెక్ యువర్ బ్లడ్ ప్రెజర్ రెగ్యులర్లీ అండ్ డిఫీట్ ది సైలెంట్ కిల్లర్’ థీమ్‌‌‌‌తో ఈనెల18వ నుంచి 25 వరకు ప్రపంచ హైపర్ టెన్షన్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్‌‌‌‌ టెన్షన్ (ఐఎస్‌‌‌‌హెచ్‌‌‌‌) సోమవారం తిలక్ రోడ్ లోని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్‌‌‌‌ టెన్షన్ (ఐసీహెచ్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ వసంత్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యకర జీవనశైలి, మానసిక ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లోపం కారణంగా రక్తపోటు సమస్యలు వేగంగా పెరుగుతున్నాయన్నారు. రక్తపోటు చాలా సార్లు తీవ్ర నష్టం జరిగే వరకు బయటపడదని, అందుకే ముందస్తు స్క్రీనింగ్ అత్యంత అవసరమని పేర్కొన్నారు.

తాజా ఆరోగ్య సర్వేల ప్రకారం హైదరాబాద్‌‌‌‌లో ప్రతి ముగ్గురు పెద్దల్లో ఒకరు హైపర్‌‌‌‌ టెన్షన్‌‌‌‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. వీరిలో సగం మందికి పైగా తమకు రక్తపోటు సమస్య ఉందన్న సంగతే తెలియదన్నారు. తెలంగాణ హైపర్‌‌‌‌ టెన్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ లిల్లీ రోడ్రిగ్స్, డాక్టర్ ఉదయ్ లాల్ మాట్లాడుతూ ఉద్యోగ ఒత్తిడి కూడా బీపీ నియంత్రణ తప్పడానికి కారణమవుతుందన్నారు.

లైఫ్​స్టైల్​లో మార్పుల ద్వారానే హైపర్ టెన్షన్ నివారణ సాధ్యమన్నారు. డాక్టర్ మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ యువత ఒత్తిడి పెంచుకుని గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారన్నారు. డాక్టర్ ఎల్.శేష శైలజ మాట్లాడుతూ  ‘మెనోపాజ్ తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా హైపర్‌‌‌‌ టెన్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. డాక్టర్ శ్రీరంగ్ అబ్‌‌‌‌కారి మాట్లాడుతూ డిజిటల్ బీపీ మానిటరింగ్, ఇంటి వద్దే రక్తపోటు పరీక్షలు చేయడం ద్వారా ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి నియంత్రించవచ్చని తెలిపారు. 

సైలెంట్ కిల్లర్..

సాధారణంగా రోజూ బీపీ 140/90  లేదా అంతకంటే ఎక్కువగా నమోదైతే హైపర్‌‌‌‌ టెన్షన్‌‌‌‌గా పరిగణిస్తారు. 120/80 కంటే ఎక్కువ రీడింగ్స్ వచ్చినా లైప్​స్టైల్​లో మార్పులు చేసుకోవాలి. హైపర్‌‌‌‌ టెన్షన్ వల్ల గుండెపోటు, స్ట్రోక్, మూత్ర పిండాల వ్యాధులు, చూపు కోల్పోవడం, గుండె వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు బయటపడే టైంకి మన శరీరానికి భారీగా నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే హైపర్‌‌‌‌ టెన్షన్‌‌‌‌ను ‘సైలెంట్ కిల్లర్’గా పిలుస్తారు.