- కేబినెట్ సిఫారసు చేసేపేర్లపై స్వేచ్ఛగానిర్ణయం తీసుకోవచ్చు
- గవర్నర్ కోటాఎమ్మెల్సీ నియామకాలపైసుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా చేపట్టబోయే ఎమ్మెల్సీ నియామకాలకు గత సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డంకి కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మంత్రి వర్గం సిఫారసు చేసే పేర్లపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చిన తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్, ప్రభుత్వం తరఫున స్టాండింగ్ కౌన్సిల్ దేవిన సెఘల్, అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్, ఎమ్మెల్సీ కోదండ రాం తరఫున నిరంజన్ రెడ్డి, ఇతర అడ్వకేట్లు హాజరయ్యారు. అలాగే ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తరఫున సీనియర్ అడ్వకేట్ సంజయ్ ఎం నూలీ ఇంప్లీడ్ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు. అలీఖాన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశానని, ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
కాగా.. నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకొని.. ఇకపై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి కొత్త పేర్లను ప్రతిపాదించేలా మంత్రి వర్గానికి మార్గం సుగమం చేయాలని అభ్యర్థించారు. ఈ
వాదనలపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్...
గవర్నర్ కోటాలో కొత్త గా చేపట్టబోయే నియామకాలకు గత ఆదేశాలు అడ్డుకాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో గవర్నర్ కు స్వేచ్ఛ ఉంటుందన్నారు. అలాగే అమీర్ ఖాన్ దాఖలు చేసిన ఐఏ తో పాటు ఈ వ్యవహారంలో దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామన్నారు. తదుపరి విచారణను ఈ మార్చి 19 కి వాయిదా వేశారు.
