- తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో దేవాదాయ చట్టాలపై సుప్రీం స్పష్టత
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు తెచ్చిన దేవాదాయ చట్టాలలోని రూల్స్ పై మెరిట్స్ ఆధారంగా తామే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ దేవాలయాలు, మతపరమైన దేవాదాయ సంస్థల నియంత్రణ చట్టాల రాజ్యాంగ చెల్లుబాటుపై ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. దేవాదాయ చట్టాల నిబంధనలపై దాఖలైన పిటిషన్లు విచారణ సందర్భంగా.. మతపర అంశాలపై హైకోర్టులే విచారించడం సరైందని గతేడాది తీర్పు వెలువరించింది.
ఈ తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లపై కోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు, కేంద్ర ప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల దేవాదాయ చట్టాలు వేర్వేరుగా ఉన్నాయన్న కోర్టు అంచనాలు సరికాదని వాదనలు వినిపించారు. దశాబ్దానికి పైగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కీలక వ్యవహారాన్ని ఇప్పుడు మళ్లీ హైకోర్టులకు బదిలీ చేయడం సరికాదని, ఇలా చేస్తే 4 రాష్ట్రాల హైకోర్టుల్లో భిన్న వాదనలకు ఆస్కారం ఉంటుందని వాదించారు. దీంతో ధర్మాసనం.. రివ్యూ పిటిషన్లపై విచారణకు అంగీకరించింది.
