- గవర్నర్ ఆఫీస్, ప్రతివాదులకు నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలపై దాఖలైన పలు ఇంప్లీడ్ అప్లికేషన్ల (ఏఐ) పై అత్యవసర జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గత ఆదేశాల తర్వాత గవర్నర్ ఆఫీసు తీసుకున్న నిర్ణయాలపై నోటీసులు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని 2024, ఆగస్టు 4న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని వారు సవాల్ చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదనలతో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాన్ని గతేడాది ఆగష్టు 13న సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తరపున సీనియర్ అడ్వకేట్ సంజయ్ ఎం నూలీ ఇంప్లీడ్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ అన్ని పిటిషన్ల పై శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేసిందన్నారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ... ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టడానికి ఏం ఉందని అడ్వకేట్ రంజిత్ కుమార్ ను ప్రశ్నించింది. ప్రస్తుతం వాదనలు వినడం లేదని, జూలై 22న విచారణలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.
