న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ దాఖలు చేసిన పరువు నష్టం, ఫోర్జరీ కేసులో ఖేరాకు సుప్రీంకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి లభించిన వ్యక్తిగత స్వేచ్ఛ విలువైందని కోర్టు స్పష్టం చేసింది.
రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమని, విచారణ పేరుతో కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఖేరాకు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది.
‘దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలి. సాక్ష్యాలను తారుమారు చేసేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరించరాదు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు’ అని పేర్కొంది.
