V6 News

రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య ఏకాభిప్రాయం మంచిదే : సుప్రీం కోర్టు

రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య  ఏకాభిప్రాయం మంచిదే : సుప్రీం కోర్టు
  •     గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇంకేం కావాలి
  •     తెలంగాణ గవర్నర్‌‌‌‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు:‘గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ సంస్థలు ఏకాభిప్రాయానికి వస్తే.. కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని 2024, ఆగస్టు 4న బీఆర్‌‌‌‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ నియామకాన్ని పక్కనబెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేశారు. 

ఈ పిటిషన్లపై బుధవారం జస్టిస్ విక్రమ్‌‌నాథ్ నేతృత్వంలోని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌‌ల ధర్మాసనం విచారించింది. గవర్నర్ కార్యాలయం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి హాజరై వాదనలు వినిపించారు. 

తెలంగాణకు కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించారని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిన కొత్త ఎమ్మెల్సీల (కోదండరాం, అజారుద్దీన్) సిఫార్సులకు సంబంధించి ఈ నెల 30తో ఆరు నెలల గడువు ముగుస్తుందని వివరించారు. ఈ పరిస్థితుల్లో కొత్త గవర్నర్ సంబంధిత అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు ఇలాంటి వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడానికి తగిన వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అటార్నీ జనరల్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కొత్త గవర్నర్ ప్రభుత్వ సిఫార్సులను పరిశీలించి, వాస్తవిక ఆధారాలతో నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. 

గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం వంటి రాజ్యాంగ సంస్థలు సామరస్యంగా పరిష్కరించుకుంటామంటే, అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది అని జస్టిస్ విక్రమ్ నాథ్ కామెంట్ చేశారు. ఆయన నవ్వుతూ చేసిన ఈ వ్యాఖ్యలతో కోర్టు రూం నవ్వులతో నిండిపోయి... ఆహ్లాదకరంగా మారింది. ‘రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలైన ప్రభుత్వం, గవర్నర్ ఈ విషయంపై ఒకే అభిప్రాయానికి వచ్చి పరిష్కరించుకుంటే మంచిదే. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు.’అని అన్నారు. అలాగే... గవర్నర్ కార్యాలయ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం... తదుపరి విచారణను జులై 22కు వాయిదా వేసింది.