- 1996 కు సంబంధించిన తెలంగాణ కేసులో సుప్రీం ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, వెలుగు: ఇన్యూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించే విధానాన్ని ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) అమలు చేయాలని తెలంగాణ కు చెందిన ఒక కేసులో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదనలు చేసింది. తెలంగాణలో 1996లో జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్ కేసులో పరిహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది.
]1996 జులైలో తెలంగాణలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాహన యజమానికి ఎలాంటి వ్యక్తిగత రిస్క్ కవర్ లేదని బీమా సంస్థ వాదించింది. అయితే, సమగ్ర బీమా (కాంప్రహెన్సివ్ పాలసీ) కింద యజమానికి కూడా కవరేజ్ వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ల విషయంలో కోర్టులు అతి సాంకేతికపరమైన అంశాలను పట్టుకువేలాడొద్దని సూచించింది. మృతుడి కుటుంబానికి 7.5 శాతం వడ్డీతో సహా రూ.10,00,500 పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి ఈ తెలంగాణ కేసు విచారణ సందర్భంగానే దేశవ్యాప్తంగా బీమా లేని వాహనాల అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
