- శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 56 రివ్యూ పిటిషన్లు
- రాఫెల్ ఒప్పందంపై కేంద్ర మాజీ మంత్రుల రివ్యూ పిటిషన్లు
- వీటన్నింటిపై తుది జడ్జిమెంట్ ఇవ్వనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ:
అత్యంత సున్నితమైన అయోధ్య రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే మరో రెండు ముఖ్యమైన, సంచలన కేసుల్లో తుది జడ్జిమెంట్ఇచ్చేందుకు సిద్ధమైంది. రాఫెల్, శబరిమల వివాదాలపై గురువారం తీర్పు వెల్లడించనుంది. ఈ రెండు కేసుల విచారణ సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోనే సాగింది. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం గురువారం తీర్పు చెప్పనుంది. జస్టిస్ ఆర్ఎఫ్ నారమిన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవీ చంద్రచూడ్ ఈ బెంచ్‌లో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా కేరళ సర్కారు భారీ భద్రత ఏర్పాటు చేసింది. 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. 24 మంది ఎస్పీలు, ఏఎస్పీలు, 112 మంది డీఎస్పీలు,264 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,185 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 8,402 మంది సివిల్ పోలీసులు, 307 మంది మహిళా పోలీసులతో సెక్యూరిటీ కల్పించింది.
రాఫెల్ రివ్యూ పిటిషన్లపైనా..
రాఫెల్ కొనుగోలు ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్ పైనా జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇవ్వనుంది. 58 వేల కోట్ల రాఫెల్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, దర్యాప్తుకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్లను 2018 డిసెంబర్ 14న సుప్రీం కోర్టు కొట్టేసింది. రాఫెల్ ఒప్పందానికి క్లీన్ ఇచ్చింది. ఈ తీర్పును రివ్యూ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, లాయర్ ప్రశాంత్ భూషణ్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీన్ని విచారించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గత మే 10న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు గురువారం తీర్పు ఇవ్వబోతోంది.

