
కమర్షియల్ హీరోగా స్టార్‌డమ్ తెచ్చుకున్నా.. ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు సూర్య. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు సూర్య. హిస్టారిక్ ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. ఇది సూర్యకి నలభై రెండో సినిమా. వివేకం, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలు తీసిన శివ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నిన్న మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
కారు మబ్బులు కమ్ముకున్న ఆకాశంలో ఓ రాబందు స్వైరవిహారం చేస్తోంది. యుద్ధ వాతావరణం నెలకొన్న ఓ రాజ్యం వైపు దూసుకుంటూ వచ్చింది. భగభగ మండుతున్న మంటలు. యుద్ధానికి సిద్ధమైన సైనికులు. దూరంగా ఓ బండమీద నిలబడి అవన్నీ చూస్తున్న ఒక యోధుడు. రాబందు నేరుగా వచ్చి అతని భుజంపై వాలింది. ఇదీ మోషన్ పోస్టర్. ఆ బండ మీద నిలబడిన వీరుడు సూర్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మోషన్ పోస్టర్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. త్రీడీ ఫార్మాట్‌లో పది భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ వీడియో రుచి చూపించింది. మూవీ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది.