పోలీసుల పనితీరుపై సర్వే

పోలీసుల పనితీరుపై సర్వే

డేటా బేస్ ఆధారంగా ప్రజలకు ఫోన్ కాల్స్
ఫీడ్ బ్యాక్​ను బట్టి సిబ్బందిపై చర్యలు
ప్రణాళికను సిద్ధం చేస్తున్న పోలీస్​ డిపార్ట్​మెంట్​

హైదరాబాద్, వెలుగుపోలీసుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే చేపట్టేందుకు రాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల నుంచి ప్రజలకు అందుతున్న సేవలు, పోలీస్ స్టేషన్లకు వెళ్లిన వారికి పోలీసుల నుంచి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోనుంది. ఇందుకోసం త్వరలో ‘ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్​ఎస్​)’ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా ప్రజలకు ఫోన్​ చేసి.. వారి నుంచి ఫీడ్​ బ్యాక్​ తీసుకోనుంది. ఫీడ్​ బ్యాక్​ ఆధారంగా సిబ్బంది పనితీరును అంచనా వేయనుంది. సిబ్బందిపై ఏమైనా ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోనుంది. ఈ వ్యవస్థకు ‘డయల్ 100’ ద్వారా వచ్చే ఫిర్యాదులు, నేరుగా పోలీస్ స్టేషన్లకు జనం వచ్చి చేసే ఫిర్యాదులు, డిపార్ట్ మెంట్ లో  అందుబాటులో ఉన్న సిటిజన్ల డేటా బేస్​ను అనుసంధానం చేయనున్నారు.

80% ఫిర్యాదుల నుంచి ఫీడ్​బ్యాక్​

ప్రస్తుతం ర్యాండమ్​గా బాధితుల నుంచి ఫీడ్​ బ్యాక్​ తీసుకునే ‘టెలీకాలర్ ఫీడ్ బ్యాక్  వ్యవస్థ’ పోలీస్​ డిపార్ట్​మెంట్​లో ఉంది. ఇందులో ప్రతి రోజు ర్యాండమ్ గా కేవలం 200 నుంచి 300 మందికే కాల్స్ చేసి ఫీడ్ బ్యాక్  తీసుకుంటున్నారు. ఇలా ర్యాండమ్​గా అదీ అతితక్కువ మంది దగ్గర ఫీడ్ బ్యాక్  తీసుకోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. రోజూ పోలీసులకు అందే ఫిర్యాదుల్లో కనీసం 80 శాతానికి పైగా ఫిర్యాదుల నుంచి ఫీడ్ బ్యాక్  తీసుకున్నప్పుడే పనితీరుపై స్పష్టమైన అవగాహన వస్తుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ‘ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. ప్రతిరోజు ‘డయల్ 100’ ద్వారా పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫోన్ నంబర్స్ ను ఇంటరాక్టివ్​ వాయిస్​ రెస్పాన్స్​ సిస్టమ్​కు కనెక్ట్​ చేస్తారు. ఆ మరుసటి రోజు సంబంధిత నంబర్లకు ఐవీఆర్ఎస్  నుంచి ఫోన్ కాల్ వెళ్తుంది. ఇందులో బాధితులు పోలీసులను ఆశ్రయించిన కాల్ టైంతో పాటు పోలీస్ స్టేషన్, కాల్ రిసీవ్ చేసుకున్న కానిస్టేబుల్, బాధితులకు అందిన సేవల వివరాలు సేకరిస్తారు.

ఫీడ్​ బ్యాక్​ ఆధారంగా చర్యలు

ఇలా సేకరించిన వివరాలతో బాధితుల పట్ల స్థానిక పోలీసులు వ్యవహరించిన విధానాన్ని పోలీస్​ డిపార్ట్​మెంట్​ రికార్డ్​  చేస్తుంది. దానిపై  ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. తీవ్రమైన ఆరోపణలు, అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఆయా సిబ్బంది నుంచి వివరణ కోరుతారు. బాధితులు చెప్పిన వివరాలతో అంతర్గత విచారణ జరిపి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. దీంతోపాటు ఆన్ డ్యూటీ పోలీసుల వల్ల ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనేది  గుర్తిస్తారు. వాటి నివారణకు కావాల్సిన చర్యలు తీసుకునేందు ప్రణాళికలు రూపొందించి, ప్రక్షాళన చేసే విధంగా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు.

15కు పైగా ఆప్షన్స్తో

ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు వచ్చే కాల్స్ లో ముందుగా తెలంగాణ పోలీస్ నమస్కారాలతో ప్రారంభమవుతుంది. అటు తర్వాత రాష్ట్ర పోలీస్ సేవల గురించి వివరిస్తూ.. ‘‘ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్లారా..? సేవలు ఎలా ఉన్నాయి..? బాగున్నాయి అనుకుంటే 1ని ప్రెస్ చేయండి. బాగోలేవు అనుకుంటే 2 ను ప్రెస్ చేయండి” అనే వాయిస్ వినిపిస్తుంది. దీంతోపాటు పోలీసుల నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇంకా ఎలాంటి మార్పులు చేయాలో తెలిపేందుకు ఆప్షన్స్ ను అందుబాటులో ఉంచనున్నారు. ఇలా 15 కు పైగా ఆప్షన్స్ తో పాటు అదనంగా ఏదైనా చెప్పాలనుకుంటే వాయిస్ రికార్డింగ్ మెసేజ్ ఫీడ్ బ్యాక్​ పంపేందుకు అవకాశం కల్పిస్తారు.  రోజూ వేలాది మందికి ఫోన్​ చేసి ఫీడ్​ బ్యాక్​ను సేకరిస్తారు.

మరిన్ని వార్తల కోసం