- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు : ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సా సౌకర్యాలను అందుబాటులో ఉంచిందని తెలిపారు.
రూ. 20 లక్షలతో ఏర్పాటు చేసిన మొబైల్ ఎక్స్ రే మిషన్ ద్వారా జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 52,901 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,741 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని, వారిలో 1,356 మంది చికిత్స పూర్తి చేసుకున్నారని వివరించారు. ఇప్పటికే జిల్లాలోని 21 గ్రామ పంచాయతీలను ‘టీబీ ముక్త్’ జీపీలుగా గుర్తించామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పీహెచ్‌సీలకు, టీబీ యూనిట్ల అభివృద్ధికి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పాటు, ప్రతిభ కనబరిచిన సర్పంచులు, సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సన్మానించారు.
సకాలంలో అనుమతులివ్వాలి
సూర్యాపేట జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కె. నరసింహతో కలిసి డీఐపీసీ, టీఎస్ ఐపాస్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పరిశ్రమల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వాలని సూచించారు.
జిల్లాలోని 36 పరిశ్రమలకు సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన 63 అప్రూవల్స్‌ను నిబంధనల మేరకు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన టీ-ప్రైడ్ పథకం కింద 82 యూనిట్ల మంజూరుకు తీర్మానించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
