స్టూడెంట్ ​లీడర్.. సుప్రీం లాయర్

స్టూడెంట్ ​లీడర్.. సుప్రీం లాయర్

కేంద్ర మంత్రిగా, ఢిల్లీ సీఎంగా పనిచేసిన సుష్మా స్వరాజ్‌.. రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. పంజాబ్​యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్​బీ పట్టా పొందిన ఆమె 1973లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్​చేశారు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు విద్యార్థి సంఘం లీడర్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. సుష్మ తండ్రి హర్​దేవ్​శర్మ ఆర్ఎస్ఎస్‌లో ఉండేవారు. సుష్మ భర్త స్వరాజ్ కౌశల్‌ ప్రముఖ లాయర్‌. మిజోరాం గవర్నరుగా కూడా పని చేశారు.

ఇదీ రాజకీయ ప్రస్థానం..

1977లో బీజేపీ తరఫున హర్యానా నుంచి సుష్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1987లో రెండోసారి గెలిచారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోక్​దళ్- బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

ఢిల్లీ తొలి మహిళా సీఎం

1990లో సుష్మ రాజ్యసభకు ఎన్నికై నేషనల్‌ పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. అంతకు ముందు1980, 1984, 1989లలో కర్నాల్ లోకసభ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1996లో దక్షిణ ఢిల్లీ సెగ్మెంట్‌ నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో 12వ లోక్‌సభకు రెండోసారి ఎన్నికై మళ్లీ కేంద్రమంత్రిగా పనిచేశారు. అదే ఏడాది అక్టోబర్ లో ఆమెను బీజేపీ హైకమాండ్‌ ఢిల్లీ సీఎం పదవి చేపట్టడానికి పంపింది. ఢిల్లీ సీఎం పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. కానీ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడంతో సుష్మా డిసెంబర్ లో మళ్లీ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి  వచ్చారు.

సోనియాపై పోటీ

1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అప్పటి కాంగ్రెస్​చీఫ్​ సోనియా గాంధీ కర్నాటకలోని బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో బీజేపీ తరఫున బలమైన నాయకురాలు అవసరం కావడంతో బీజేపీ.. సుష్మను బరిలోకి దింపింది. సోనియాపై ఓడిపోయినా గట్టిపోటీ ఇచ్చి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.

కేంద్ర మంత్రిగా..

2004 ఏప్రిల్ లో సుష్మ ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 2006 ఏప్రిల్ లో మధ్యప్రదేశ్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009లో విదిషా నుంచి విజయం సాధించి లోక్​సభలో ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించారు. 2014లో మరోసారి గెలిచి మోడీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్యం కారణంగా 2019 ఎన్నికల్లో  పోటీ చేయలేదు. మొత్తంగా ఏడుసార్లు లోక్​సభ ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆమె పనిచేశారు.