ఇయ్యాల్నే ఐదో ఫేజ్ పోలింగ్

ఇయ్యాల్నే ఐదో ఫేజ్ పోలింగ్
  • ఆరు రాష్ట్రాలు, రెండు యూటీల్లో ఎన్నికలు
  • 49 స్థానాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ
  • యూపీలో 14 సీట్లకు పోలింగ్​..బరిలో నలుగురు కేంద్ర మంత్రులు
  • జార్ఖండ్​లోని గాండే అసెంబ్లీ సీటుకు బైపోల్​ 
  • పోటీలో మాజీ సీఎం హేమంత్​ భార్య కల్పన

న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికల్లో భాగంగా ఐదో ఫేజ్​లో సోమవారం ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలక్షన్లు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్​లో ఏడు, ఒడిశాలో ఐదు, బిహార్​లో ఐదు, జార్ఖండ్​లో మూడు, జమ్మూ కాశ్మీర్, లడఖ్​లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాజ్​నాథ్ , స్మృతి , రాజీవ్ ప్రతాప్, పీయూష్​గోయల్, రాహుల్ గాంధీ, కరణ్ భూషణ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా, రోహిణి ఆచార్యతో పాటు పలు పార్టీల కీలక నేతలు పోటీ చేస్తున్న సెగ్మెంట్​లకు పోలింగ్ జరగనున్నది. ఇప్పటి వరకు 4 ఫేజ్​ల​లో మొత్తం 379 లోక్​సభ సెగ్మెంట్​లకు పోలింగ్ కంప్లీట్ అయింది. యూపీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్న రాయబరేలీ, అమేథీలకు కూడా సోమవారమే ఎన్నికలు జరగనున్నాయి. రాయ్​బరేలీలో రాహుల్, అమేథీలో స్మృతి, లక్నో లో రాజ్​నాథ్,  బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు.

యూపీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

యూపీలో మొత్తం 14 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నలుగురు కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్ (లక్నో), స్మృతి ఇరానీ (అమేథీ), కౌశల్ కిశోర్ (మోహన్​లాల్ గంజ్), సాధ్వీ నిరంజన్ జ్యోతి (ఫతేపూర్) బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ తరఫున రాయ్​బరేలీ నుంచి రాహుల్ పోటీలో ఉన్నారు. 14 లోక్​సభ స్థానాల నుంచి 144 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2.68 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బీజేపీ పోటీ చేస్తున్న 14 స్థానాల్లోంచి 11 సెగ్మెంట్​లలో సిట్టింగ్ ఎంపీలే బరిలో ఉన్నారు. రాజ్​నాథ్ సింగ్ లక్నో నుంచి నాల్గో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఈయనపై సమాజ్​వాది పార్టీ నేత రవిదాస్ మన్హోత్ర పోటీ చేస్తున్నారు. ఇక అమేథీ నుంచి బీజేపీ తరఫున స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నుంచి కిశోరి లాల్ శర్మ బరిలో ఉన్నారు. టెంపుల్ టౌన్ అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్​సభ స్థానం నుంచి బీజేపీ తరఫున లల్లూ సింగ్ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేశారు. సమాజ్​వాది పార్టీ నుంచి అవధేశ్ ప్రసాద్ బరిలో ఉన్నారు. ఇక, ఇండియా కూటమి తరఫున అమేథీ నుంచి కేఎల్ శర్మ, బారాబంకి నుంచి తనూజ్ పునియా, ఝాన్సీ నుంచి ప్రదీప్ జైన్ పోటీ చేస్తున్నారు. లక్నో ఈస్ట్ అసెంబ్లీ ఎమ్మెల్యే అశుతోష్ టాండన్ చనిపోవడంతో ఈసీ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నది. 

అసెంబ్లీ బైపోల్ బరిలో కల్పనా సోరెన్

జార్ఖండ్​లో ఛాత్ర, కొడెర్మా, హజారిబాగ్ లోక్​సభ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. మొత్తం 58.22 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 28.29 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 6,705 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కొడెర్మా నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి పోటీ చేస్తున్నారు. జేఎంఎం, బీజేపీ నేతృత్వంలోని కూటముల మధ్య గట్టి పోటీ నెలకొన్నది. గాండే సిట్టింగ్ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో ఈ అసెంబ్లీ సెగ్మెంట్​కు ఈసీ బై పోల్ నిర్వహిస్తున్నది. ఇక్కడ 3.15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున దిలీప్ కుమార్ వర్మ బరిలో ఉన్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.