- డిసెంబర్21న మిస్సింగ్, ఈ నెల12న ఫిర్యాదుపై అనుమానాలు
గద్వాల/అలంపూర్, వెలుగు: అలంపూర్ పీఏసీఎస్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నుంచి మక్కల లారీ మాయం చేసింది కడపకు చెందినవారి పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇంటి దొంగల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21న లారీ మాయమైనప్పటికీ, ఈ నెల 12న కంప్లైంట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు ఎన్ని క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశారు. ఎన్ని లారీల్లో లోడ్ చేసి, ఎక్కడికి పంపించారు? అనే వివరాలు ప్రతి రోజు సరిచూసుకోవాల్సి ఉంటుంది.
కానీ, పీఏసీఎస్ సిబ్బంది కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో లారీ మాయమైనా గుర్తించలేదని చెబుతున్నారు. 21న గోదామ్‌కు పంపించిన మూడు లారీల్లో ఒక లారీ (ఏపీ39వీఎల్4269) 325 క్వింటాళ్ల మక్కలు మాయం అయినట్లు గుర్తించారు. లారీ డ్రైవర్ వెంకయ్య అని పేరు నమోదు చేసిన నిర్వాహకులు అతని ఫోన్ నెంబర్ నమోదు చేయలేదు. లారీ నెంబర్ తో పాటు డ్రైవర్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉన్నా మాయమైన లారీ వివరాలు నమోదు చేయకపోవడంతో, ఈ వ్యవహారంలో పీఏసీఎస్ సిబ్బంది సహకరించి ఉంటారని అంటున్నారు.
పోలీసుల సీరియస్ ఎంక్వైరీ..
మొక్కజొన్న లారీ మాయమైన కేసును పోలీసులు సీరియస్‌గా ఎంక్వైరీ చేస్తున్నారు. పీఏసీఎస్ సెక్రటరీ శ్రీనివాసులు అలంపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. లారీ పెబ్బేరు మీదుగా వనపర్తికి, అక్కడి నుంచి కల్వకుర్తికి వెళ్లినట్లు సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించారు. లారీ మాయమై ఎక్కువ రోజులు కావడంతో పూర్తి పుటేజీ పోలీసులకు దొరకక ఎంక్వైరీకి ఇబ్బంది ఎదురవుతున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు?
అలంపూర్ చౌరస్తాలో కడపకు చెందిన లారీలు ఉంటాయి. ఆ లారీలకు చెందిన వ్యక్తులే మొక్కజొన్న లోడ్‌ను తీసుకెళ్లి ఉమ్మడి జిల్లాలో అమ్మినట్లు తెలుస్తోంది. ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ తో పాటు మరికొందరిని ఎంక్వైరీ చేసి, ఏపీలోని ఓర్వకల్ దగ్గర ఇద్దరు అనుమానితులను అలంపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లారీ మాయం కంటే ముందే వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడినట్లు గుర్తించారు. వారికే మొక్కజొన్నలు అమ్మినట్లు అనుమానం ఉండడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు ఒక పోలీస్ టీమ్ ప్రయత్నం చేస్తోంది.
ఎంక్వైరీ కొనసాగుతోంది..
మొక్కజొన్న లోడ్ మాయం చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేశాం. ఎంక్వైరీ కొనసాగుతోంది. త్వరలోనే అన్ని వివరాలు చెబుతాం.- రవిబాబు, సీఐ, అలంపూర్
