న్యూఢిల్లీ, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ పార్లమెంట్ చరిత్రలోనే ఆ రోజును ఒక‘బ్లాక్ డే’గా ఆయన అభివర్ణించారు. బుధవారం స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో టీడీపీ తరపున ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కి ఏపీని విభజించిందని విమర్శించారు. సాధారణంగా అసెంబ్లీ ఆమోదించని ఏ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టరని తెలిపారు. కానీ, నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజనను వ్యతిరేకించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా బిల్లును ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు.
ఫిబ్రవరి 13, 2014న బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో సొంత పార్టీ వారితో సహా మొత్తం 18 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. బిల్లు పాస్ అయ్యే సమయంలో లోక్‌సభ తలుపులు, గ్యాలరీలు మూసివేసి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లైవ్ టెలికాస్ట్‌ను నిలిపివేశారన్నారు. విభజన బిల్లుపై అసలు ఓటింగ్ జరిగిందా లేదా అన్నదానికి ఆధారాలు లేవని, ఎంతమంది అనుకూలంగా ఓటు వేశారో చెప్పే రికార్డులు కూడా లేవని ఆర్టీఐ ద్వారా తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
నాడు రాజ్యాంగ విలువలని కాలరాసిన కాంగ్రెస్ పార్టీ, నేడు స్పీకర్ తీరు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆనాడు జరిగిన పరిణామాలపై సభలో చర్చ జరగాలని, అనైతిక విభజనపై కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
