విద్యార్థులను టెర్రరిస్టులు అంటారా?..ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌పై మల్లికార్జున ఖర్గే ఫైర్

విద్యార్థులను టెర్రరిస్టులు అంటారా?..ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌పై మల్లికార్జున ఖర్గే ఫైర్
  •     కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ: నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను టెర్రరిస్టులు అని సంబోధించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌పై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. 

‘‘దేశంలో ఇప్పటివరకు 90 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. దీనివల్ల కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా మోదీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం తన కుర్చీని పట్టుకుని వేలాడుతున్నారు. పైగా, న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులను టెర్రరిస్టులతో పోల్చడం దారుణం” అని తెలిపారు.

 పార్లమెంటులో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే రైతులను ఆందోళన్ జీవి, పరాన్నజీవులు అంటూ అవమానించిన విషయాన్ని దేశం ఇంకా మర్చిపోలేదని మల్లికార్జున ఖర్గే చెప్పారు. ‘‘ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. కానీ, ఈసారి విద్యార్థుల గొంతు దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తుంది. మంత్రి ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాల్సిందే” అని పేర్కొన్నారు.

మేం టెర్రరిస్టులం కాదు: అభిజీత్ దీప్కే

విద్యార్థులను టెర్రరిస్టులు అని ధర్మేంద ప్రధాన్ సంబోధిస్తున్న ఒక వీడియో క్లిప్‌‌‌‌ను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ‘ఎక్స్’లో షేర్ చేస్తూ మంత్రిపై మండిపడ్డారు. ‘‘ప్రధాన్ జీ, మేం టెర్రరిస్టులం కాదు. విద్యార్థుల మరణాలకు కారణమైన మీలాంటి వారి నుంచి మాకు దేశభక్తి సర్టిఫికెట్లు అక్కర్లేదు’’ అని వెల్లడించారు.