- ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అల్ థానీ
న్యూఢిల్లీ: ఖతార్‌లో దెబ్బతిన్న లిక్విఫైడ్నేచురల్గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ఉత్పత్తిని కొద్ది వారాల్లోనే నార్మల్ లెవెల్‌కు తీసుకొస్తామని ఆ దేశ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ తెలిపారు. ప్రస్తుతం రిపేర్ పనులు వేగంగా సాగుతున్నాయని, పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే ఉత్పత్తి పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని చెప్పారు. మంగళవారం ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సమయంలో ఖతార్‌లోని భారీ రాస్ లఫాన్ ఎల్‌ఎన్‌జీ కేంద్రంపై దాడులు జరగడంతో ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఖతార్ ఎనర్జీ సంస్థ ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య ఏర్పడిన అవగాహనతో హార్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అల్‌థానీ తెలిపారు.
