నల్గొండ హత్యలు.. ఆస్తి కోసమేనా ? మృతురాలు హసీనా కూతురు, అల్లుడిపై అనుమానాలు

నల్గొండ హత్యలు.. ఆస్తి కోసమేనా ? మృతురాలు హసీనా కూతురు, అల్లుడిపై అనుమానాలు

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఫ్యామిలీ మర్డర్ మిస్టరీ వీడడం లేదు. నలుగురు కుటుంబ సభ్యులను ఒకేసారి అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన కారణాలు ఏంటని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ హత్య వెనుక కుటుంబ సభ్యుల హస్తం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రధానంగా హత్యకు గురైన హసీనా సొంత కూతురు, ఆమె భర్తపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన ఇద్దరు పిల్లలు షేక్ సుల్తాన్ మొదటి భార్య పిల్లలు కావడంతో.. ఆస్తి ఎక్కడ వాళ్లకు వెళ్తుందోనన్న భయంతోనే హసీనా సొంత కూతురు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శివారులోని కుంట్లూరులో ఉంటున్న హసీనా కూతురు, అల్లుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ప్రొఫెషనల్ కిల్లర్స్ పనేనా ?
హత్యలు జరిగిన తీరు చూస్తుంటే ఇది పక్కా ప్రొఫెషనల్స్, సుపారీ గ్యాంగ్ పనేనని పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. హత్య అనంతరం దుండగులు చిన్న క్లూ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకుండా చూడడం, ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా ప్లాన్ చేయడం చూస్తుంటే.. ప్రొఫెషనల్ కిల్లర్సేనని అనుమానిస్తున్నారు. అయితే ఇదే ఇంట్లో రెండు నెలల కింద చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ ఇదే ఇంట్లో నలుగురిని చంపడం వెనుక పక్కాగా ఆస్తి కోసమేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రంగంలోకి 10 టీమ్స్, 100 మంది పోలీసులు
హత్యల కేసును ఛేదించడం పోలీస్ లకు సవాల్ గా మారింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ శివరాంరెడ్డి నేతృత్వంలో సుమారు 100 మంది పోలీసులతో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో కీలక ఆధారాలు సేకరించడంతో పాటు నిందితులు వాడిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరో వైపు సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతూనే, మృతుల కాల్ డేటా ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు.

గతంలో జరిగిన చోరీ కేసుకు, ఈ హత్యలకు ఏమైనా లింక్ ఉందా అని ఆరా తీస్తున్నారు. నిందితులు ఇంట్లోకి చొరబడి మొదట దంపతులను వరండాలోకి లాక్కొచ్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో 13 ఏండ్ల కూతురు అప్సర భయంతో బెడ్ కింద దాక్కున్నా.. వదలకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నరికి చంపినట్లు తెలుస్తోంది. నిందితులు ఒకరేనా లేక గ్యాంగ్‌‌‌‌‌‌‌‌గా వచ్చారా ? అన్నది వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా తేల్చనున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.