వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం నాగరాల వద్ద అటవీ ప్రాంతంలో పునుగుపిల్లిని పోలి ఉన్న కస్తూరిపిల్లి కనిపించింది. అటవీశాఖ సిబ్బంది నాగరాల అటవీ ప్రాంతంలో మంగళవారం అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న పిల్లిని గుర్తించి వనపర్తి పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు. అచ్చం పునుగుపిల్లిని పోలిఉండడంతో అదే అనుకున్నారు.
కస్తూరిపిల్లి, గంధంపిల్లి, స్మాల్ ఇండియన్ సివెట్ గా అని పిలిచే ఈ జంతువు శాస్త్రీయ నామం ‘వివెరికుల ఇండికా’. ఇది సాధారణంగా దక్షిణ ఆసియా ఖండం అంతటా విస్తరించి ఉంటుంది. రాత్రి సమయాల్లో మాత్రమే సంచరించే ఈ జీవి ఎలుకలు, పక్షులు, పాములను తింటూ చెట్ల తొర్రల్లో, భూమి లోపల బొరియలు చేసుకుని జీవిస్తాయని జడ్చర్ల బూర్గుల రామకృష్ణరావు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బాటనీ లెక్చరర్ బి.సదాశివయ్య తెలిపారు.
