ఇంధనపల్లి ఫారెస్ట్ ఆఫీస్ పై ఆదివాసీల దాడి.. చేపల వేటకు వెళ్లిన యువకులను అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం

ఇంధనపల్లి ఫారెస్ట్ ఆఫీస్ పై ఆదివాసీల దాడి.. చేపల వేటకు వెళ్లిన యువకులను అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం
  • ఫారెస్ట్ ఆఫీస్ లో  ఫర్నీచర్ ధ్వంసం
  • ఘటనా స్థలానికి చేరుకొని ఆఫీసర్లతో మాట్లాడిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

మంచిర్యాల, వెలుగు : తమ గ్రామానికి చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నారన్న కోపంతో ఆదివాసీలు ఫారెస్ట్ ఆఫీస్ పై దాడి చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నాయకపుగూడకు చెందిన మూతి మల్లేశ్, చంటి, రాయ విష్ణు, అనిల్, కృష్ణ, శ్రీను కలిసి ఆదివారం మధ్యాహ్నం సమీప వాగులో చేపలు పడుతున్నారు. 

ఇదే సమయంలో ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ తన సిబ్బందితో వెళ్లి యువకులను చితకబాది అదుపులోకి తీసుకున్నారు. విష్ణు, శ్రీను తప్పించుకొని బయటకు రాగా మిగితా నలుగురు ఫారెస్ట్ అధికారుల అదుపులోనే ఉన్నారన్న విషయం తెలుసుకున్న నాయకపుగూడ చెందిన ఆదివాసీలు భారీ సంఖ్యలో ఇంధనపల్లి రేంజ్ ఆఫీస్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అదుపులో ఉన్న యువకులను రిలీజ్ చేయాలంటూ కొంతమంది ఫారెస్ట్ ఆఫీసులోకి చొచ్చుకుపోయి ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

అనంతరం మంచిర్యాల -నిర్మల్ మెయిన్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, జన్నారం, దండేపల్లి ఎస్సైలు ఉదయం కిరణ్, రాజవర్ధన్ ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినకుండా ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఉన్న యువకులను తమకు అప్పగించేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పట్టుబట్టారు. 

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హుటాహుటిన ఉట్నూర్ నుంచి ఇంధనపల్లికి చేరుకొని ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడారు. అధికారుల వేధింపులు రోజురోజుకు  పెరుగుతున్నాయని, వారు తమ పద్ధతి మార్చుకోకపోతే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

అటవీ శాఖలోని కొందరు ఉన్నతాధికారుల మితిమీరిన చర్యల వల్లే  సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఆదివాసీ యువకులను వెంటనే విడుదల చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాత్రి 11 గంటల వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంది.