- కాలువలో ఏపుగా పెరిగిన చెట్లు
- చివరి ఆయకట్టు మండలాల్లోని దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అంతంతే
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తిలోనే రబీ వరి ఎక్కువ
వనపర్తి/పెబ్బేరు, వెలుగు:జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువలో చెత్తాచెదారం, లైనింగ్ వెంబడి చెట్లు ఏపుగా పెరగడంతో రబీ సీజనులో పంటలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో కాలువ కింద పంటలు వేసుకుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా బోరుబావులున్న చోట, జూరాల కింద రబీలో వరి సాగవుతోంది. కాలువలో ప్రాజెక్టు నీరు చివరి వరకూ పారాలంటే చెత్తాచెదారం, ఇతర అడ్డంకులు ఉండొద్దు.
కానీ, జూరాల నుంచి ప్రవహించే కాలువలో కంపచెట్లు పెరిగి ఏపుగా పెరిగాయి. దీంతో లైనింగ్ దెబ్బతింటోంది. ఫలితం గా నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రబీ సీజనులో అత్యధికంగా వనపర్తి జిల్లాలో 1.75లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. ఇందులో జూరాల ప్రాజెక్టు చివరిఆయకట్టు మండలాల్లో దాదాపు 50వేల ఎకరాలలో వరి పంట వేశారు.
చివరి వరకు అంతంతే
ప్రధాన కాలువలో చెట్లు పెరిగి, చెత్తాచెదారం చేరి లైనింగులు దెబ్బతింటున్నాయి. ఫలితంగా చివరి ఆయకట్టున్న శ్రీరంగాపూరు, వీపనగండ్ల, చిన్నంబావి, కొల్లాపూరు నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలాల రైతులు సాగునీటి కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. రబీ సీజనులో వరితో పాటు ఇతర పంటలు వేసుకున్న రైతులు కోత సమయానికి సాగునీరందించాలని కోరుతున్నారు. వర్షాకాలంలో వరద నీటి సమస్య ఎదురైతే, రబీ సీజనులో పంటలకు సాగునీరందకుండా కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయి ఆందోళన చెందుతున్నారు.
శిథిలావస్థలో బ్రిడ్జి..
గ్రామాలను కలిపే జూరాల ప్రధాన ఎడమ కాలువ పై పెబ్బేరు శివారులో ఒక బ్రిడ్జి నిర్మించారు. పాత బడిన బ్రిడ్జికి ఒక వైపున రెయిలింగ్ గోడ కూలిపోవడంతో ప్రమాదకర రీతిలో రైతులు ఆ బ్రిడ్జి మీదుగా పోతున్నారు. పంట పొలాల పనులకు వినియోగించే ట్రాక్టర్లు, ఎద్దుల బళ్లు ఈ బ్రిడ్జి మీదుగానే పోనిస్తున్నారు. బ్రిడ్జి రెయిలింగ్ గోడను నిర్మించి ప్రమాదాన్ని నివారించమని రైతులు అధికారులను కోరి కోరి విసుగెత్తిపోయారు.
చివరికి రెయిలింగ్ గోడ పడిపోయిన ప్రాంతంలో ఒక ప్లాస్టిక్ తాడు కట్టి వదిలేశారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగినా రైతులు, పశువులు, వాహనాలు జూరాల కాలువలో పడిపోవడం ఖాయం. మళ్లీ వర్షాకాలం నాటికి బ్రిడ్జి రెయిలింగ్ గోడను నిర్మించాలని, కాలువలో పేరుకుపోయిన చెట్లను తొలగించి లైనింగ్‌ను సరిచేయాలని రైతులు కోరుతున్నారు.
