దుర్గమ్మ.. దీవించమ్మా..ఏడుపాయలకు పోటెత్తిన జనం

దుర్గమ్మ.. దీవించమ్మా..ఏడుపాయలకు పోటెత్తిన జనం

పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ సన్నిధి జనారణ్యమైంది. మాఘ అమావాస్య సందర్భంగా ఆదివారం హైదరాబాద్, కర్నాటక, మహారాష్ట నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచే ఘనపూర్ ఆనకట్ట దగ్గర, మంజీరా నదీ పాయల్లో పవిత్ర స్నానాలు చేసి వన దుర్గా భవానీ మాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 

ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి  అభిషేకం, అర్చనలు నిర్వహించి అందంగా అలంకరించారు. పలువురు భక్తులు గండ దీపాలు, డప్పు చప్పుల్ల మధ్య బోనాలను తీసుకెళ్లి అమ్మకు సమర్పించారు. అనంతరం పచ్చని చెట్ల కింద భోజనాలు చేసి సందడిగా గడిపారు. ఆలయ పరిసరాలు దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. అడిషనల్​కలెక్టర్​నగేశ్, అడిషనల్ ఎస్పీ మహేందర్​, ఆర్డీవో రమాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.