వనపర్తి/రేవల్లి, వెలుగు: వనపర్తి నియోజకవర్గానికి గొల్లపల్లి, --చీర్కపల్లి రిజర్వాయర్ వరప్రదాయినిగా మారుతుందని, దీనిపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత సత్యశీలారెడ్డి విమర్శించారు. ఆదివారం రేవల్లి మండలం గొల్లపల్లిలో మీడియాతో మాట్లాడుతూ 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లపల్లి, -చీర్కపల్లి ప్రాజెక్టుతో పాటు మరో 20 రిజర్వాయర్ల ఏర్పాటుకు జీవో నెం. 941 జారీ చేసిందని గుర్తు చేశారు.
జీవోలు జారీ చేసిన విషయం మరిచి నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేక ప్రాజెక్టు వద్దంటూ ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. 2018లో సర్వేలు, మ్యాపింగ్ పూర్తి చేసి, భూములు కోల్పోయే రైతులకు కేవలం రూ.6.50 లక్షల పరిహారం ఇస్తామని నమ్మబలికారని గుర్తు చేశారు.
నాడు మంజూరు చేసిన ప్రాజెక్టును నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,100 కోట్లతో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అమాయక రైతులను ఆందోళనలకు ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రకటించిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువగా, కొడంగల్ తరహాలో ఎకరాకు రూ.20 లక్షలకు పైగా పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని 42,663 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పాలమూరు, -రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. రూ. వేల కోట్ల కమీషన్ల కోసం ఆశ పడ్డారే తప్ప వనపర్తికి చుక్క నీరు తీసుకురాలేదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు దిగినా రిజర్వాయర్ నిర్మాణం జరిగి తీరుతుందని చెప్పారు. అచ్యుత రామారావు, కొంకి వెంకటేశ్, వాడల పర్వతాలు, జమ్మి మల్లేశ్, గొల్లపల్లి, చీర్కపల్లి సర్పంచులు అనసూయ, రవి పాల్గొన్నారు.
