పైచేయి సాధించేందుకు కాంగ్రెస్
పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్
పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సారి బల్దియా ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది. ఇదివరకు మున్సిపల్‌ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. కానీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో కమలం పార్టీలో జోష్ పెరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కౌన్సిలర్ స్థానాల్లో అభ్యర్థులను నిలపడంతో పాటు, పలు చైర్మన్ పదవులు సాధించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది. ముఖ్యంగా మెదక్ పరిధిలోని 15 మున్సిపాలిటీలపై ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో మెజారిటీ కౌన్సిలర్ స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్ నాలుగు చైర్మన్‌పదవులను కైవసం చేసుకుంది. ఈ సారి కూడా పట్టు నిలుపుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ధీటైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలుపద్మా దేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఎఫ్డీసీ మాజీ చైర్మెన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు.
మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ పదవులు దక్కించుకుని ఊపుమీదున్న అధికార కాంగ్రెస్ పార్టీ 4 మున్సిపల్‌చైర్మన్ పదవులను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. మెదక్, రామాయంపేట మున్సిపల్ఎన్నికలపై ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలపై డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి, తూప్రాన్ మున్సిపాలిటీపై మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి దృష్టిపెట్టారు. ఇక 4 మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలపై ఎంపీ రఘునందన్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో 11 మున్సిపాలిటీలు, 263 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జహీరాబాద్ మినహా నారాయణఖేడ్, అందోల్- జోగిపేట, కోహిర్ బల్దియాల్లో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. జహీరాబాద్ మునిసిపాలిటీలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వనుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో సంగారెడ్డి, సదాశివపేట బల్దియాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొంది.
పటాన్ చెరు పరిధిలోని ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనున్నారు. కొన్నిచోట్ల సీపీఎం, సీపీఐ బలమైన అభ్యర్థులను బరిలో దింపి గట్టి పోటీ ఇవ్వనున్నాయి.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లాలో హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాల్టీల పరిధిలోని 72 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు ఎమ్మెల్యే హరీశ్‌రావు, కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారు మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఆయా నియోజకవర్గ ఇన్చార్జిల వద్దకు వెళ్తూ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాలేదని పోటీ చేసే నేతలు ప్రజల్లో ఉంటే వారి అభ్యర్థనలు పరిశీలిస్తామని చెప్పడంతో పలువురు ఉదయం సాయంత్రం వార్డుల్లో పర్యటిస్తున్నారు. మరికొందరు రిజర్వేషన్లు అనుకూలించకున్నా బరిలో దిగుతామని అవసరమైతే కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
