మహబూబ్నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలకేంద్రంలోని రామకొండ భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం అమావాస్య కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున కొండకు చేరుకున్నారు. ఆదివారం అమావాస్య ప్రత్యేకం కావడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే కొండ మీదకు చేరుకునేందుకు క్యూ కట్టారు.
భక్తులు ఎక్కువగా రావడంతో సీతారామస్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. 10 గంటల తర్వాత భక్తుల సంఖ్య మరింత పెరగడంతో భక్తులను కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎస్సై తిరుపాజితో పాటు హన్వాడ, నవాబ్‌పేట ఎస్సైలు వెంకటేశ్, విక్రమ్సిబ్బందితో చేరుకొని, స్వామి దర్శనం త్వరగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం పెద్దగూడెం సర్పంచ్ సుజాత తాగునీటిని ఏర్పాటు చేశారు. - కోయిల్‌కొండ, వెలుగు
