షాద్‌నగర్/ అయిజ, వెలుగు: హోలీ వేడుకల్లో పలు చోట్ల విషాదం నెలకొంది. చెరువుల్లో ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురు మృతిచెందిన ఘటన బుధవారం వేర్వేరు చోట్ల జరిగింది. గద్వాల జిల్లా ఐజా మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పుల్లెద్దుల రాజు(20) మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.
హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకున్న అనంతరం ఫరూక్‌నగర్ మండలం రాయికల్ చెరువుకు స్నానం చేసేందుకు వెళ్లాడు. చెరువులోకి దిగిన రాజు కొద్ది సేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన స్థలానికి ఆర్డీవో సరిత, ఏసీపీ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ నాగయ్య చేరుకుని గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
బుధవారం రాజు మృతదేహాన్ని వెలికి తీశారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న మహబూబ్‌నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబానికి రూ.7.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తంగళ్లపల్లి మండలంలో ఇద్దరు..
తంగళ్లపల్లి, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పాపయ్యపల్లె గ్రామంలో చెరువులో మునిగి ఇద్దరు చనిపోయారు. జైనూర్‌కు చెందిన మోతివాడ్ నాగరాజు(21), గోగులాపాడుకు చెందిన ముండ్రి రత్తయ్య(24) పాపయ్యపల్లె శివారు రైల్వే పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. బుధవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సమీపంలోని చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
