జడ్చర్ల, వెలుగు : ఫోన్ పే ఆధారంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆన్‌లైన్ గేమింగ్, పేకాట వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన రాసూరి హరికృష్ణ(26), షేక్ ఇసాక్(22), మూడే లక్ష్మణ్ నాయక్(33) అనే ముగ్గురు పాత నేరస్తులు ముఠాగా ఏర్పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత నెలలో కర్నూలు జిల్లా గోనెగండ్లలో మహిళ మెడలో గొలుసు, గద్వాల జిల్లా ఇటిక్యాల పరిధిలో మోటార్ సైకిల్, ఫిబ్రవరి 27న మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్ల పట్టణంలోని కిష్టారెడ్డి కాలనీలో ఒక మహిళ మెడలోని రెండు తులాల పుస్తెల తాడును దొంగిలించారు.
జడ్చర్ల దొంగతనం తర్వాత నిందితులు తమ మోటార్ సైకిల్‌ను మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ శివారులో వదిలేసి, ఆర్టీసీ బస్సులో పారిపోతూ టికెట్ కోసం ‘ఫోన్ పే’ ద్వారా నగదు చెల్లించారు. ఈ డిజిటల్ లావాదేవీ ఆధారంగా జడ్చర్ల పోలీసులు దర్యాప్తు చేపట్టి బుధవారం నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు తులాల బంగారు నగలు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సమర్థవంతంగా కేసును ఛేదించిన సీఐ కమలాకర్, ఎస్సై మల్లేశ్బృందాన్ని జిల్లా అధికారులు అభినందించారు.
