- మెయింటెనెన్స్లేక కాలువల్లో పేరుకున్న బురద, జమ్ము
- ఏండ్లుగా పెండింగ్‌లోనే కాలువల లైనింగ్ పనులు
- చివరి ఆయకట్టు వరకు అందని సాగునీరు
మహబూబ్‌నగర్, వెలుగు: ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. రిజర్వాయర్లు ఫుల్ కెపాసిటీకి చేరుకున్నాయి. వరి సాగు డబుల్ అయ్యింది. కానీ ప్రాజెక్టు చివరి ఆయకట్టుదారుల్లో ఆందోళన నెలకొన్నది. ఏండ్లుగా కాలువల మెయింటెనెన్స్‌ను గాలికొదిలేయడంతో ఇప్పుడవి పూడిపోయాయి. జమ్ము పెరిగి, బురదతో నిండిపోయాయి. కాలువల కట్టలకు రెండు వైపులా లైనింగ్ లేక కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. దాదాపు 50 వేల ఎకరాల్లో వరి పంటలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
టెయిల్ఎండ్ కు అందని సాగునీరు
మమబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని కోయిల్‌సాగర్, భీమా లిఫ్ట్-1 పరిధిలోని సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల కింద దేవరకద్ర, మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, మక్తల్, నర్వ, మాగనూరు, కృష్ణ మండలాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుండగా, అందులో ఈ మూడు రిజర్వాయర్ల కింద దాదాపు 1.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. ఇందులో కోయిల్‌సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా దేవరకద్ర ప్రాంతానికి ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు వెళ్తున్నా, రైట్ కెనాల్ కింద ఇబ్బందులు వస్తున్నాయి.
ఈ కెనాల్ పరిధిలోని మరికల్ మండలం పూసల్‌పహాడ్, రాకొండ, తీలేరు, పెద్దచింతకుంట, మరికల్, పల్లెగడ్డ, ధన్వాడ మండలం గోటూరు, కొండ్రోనిపల్లి, రామకిష్టాయపల్లి, కొండాపూర్ గ్రామాలకు సాగునీరు అందుతుండగా, చిన్నచింతకుంట మండలం లాల్కోట, బండ్రవల్లి, పళ్లమర్రి, నెల్లికొండి వరకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే ఈ కెనాల్ రివిట్మెంట్ కూలిపోయింది. కంప చెట్లు పెరిగిపోవడంతో పళ్లమర్రి, నెల్లికొండి గ్రామాలకు సాగునీరు అందడం లేదు. భీమా లిఫ్ట్-1 కింద మక్తల్ నియోజకవర్గంలో సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లు ఉండగా, ఇందులో భూత్పూర్ రిజర్వాయర్ కింద ఎలాంటి ఆటంకం లేకుండా కాలువల ద్వారా సాగునీరు అందుతోంది. సంగంబండ కాలువల కింద టెయిల్ఎండ్ గ్రామాలైన మాగనూరు, ఓబ్లాపూర్, పెగడబండ, పరమాన్‌దొడ్డి, వడ్వాట్, ఉందెకోడ్, రాంపూర్, లంకాల, ఉంద్యాల గ్రామాలకు సాగునీరు అందడం లేదు. ఈ గ్రామాల పరిధిలోని కాలువల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి.
దెబ్బతిన్న కాలువలు
కోయిల్‌సాగర్, సంగంబండ రిజర్వాయర్ల పరిధిలో ఉన్న కాలువలను ఏండ్లుగా మెయింటెనెన్స్ చేయడం లేదు. ఈ రెండు రిజర్వాయర్ల పరిధిలోని కాలువ కట్టలకు రెండు వైపులా లైనింగ్ పనులు కొన్ని చోట్ల పెండింగ్‌లో పెట్టారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా కట్టల వెంట ఉన్న మట్టి కాలువల్లోకి జారిపోతోంది. దీంతో ఆ మట్టి పేరుకుపోయి బుదరగా మారుతోంది. దీనికితోడు ఈ బురదలో జమ్ము, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఇవి ఎండిపోయాక తొలగించాల్సి ఉన్నా.. ఆ పనులు పక్కకు పెట్టేశారు. దీంతో ప్రతి యాసంగిలో టెయిల్ఎండ్లో వరి సాగు చేస్తున్న రైతులు సాగునీటి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే ఈసారి మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండుతున్నాయి. బోర్లు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో వరి పంటలను కాపాడుకునేందుకు కాలువల నీరే ఆధారమైంది. దీంతో పూడిపోయిన కాలువల్లో సిల్ట్ తొలగించే కార్యక్రమాలు చేపట్టి, చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల మరింత ముదిరి సాగునీటిని ఇబ్బంది ఏర్పడితే, తమ పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీరు ముందుకు వస్తలేవు..
కాలువకు నీళ్లు వస్తయని సంబుర పడ్డాం. కానీ కాలువ పొంటి పేరుకుపోయిన ఒండ్రు, కంప చెట్లు నీటి వేగాన్ని అడ్డుకుంటున్నాయి. కొన్ని చోట్ల వృథాగా బయటకు పొర్లుతున్నాయి. వెంటనే కంప చెట్లను తొలగించి కాలువను శుభ్రం చేస్తే చాలు ఈ ఎండాకాలంలో మా పంటలు గట్టెక్కుతాయి.-కోస్గి నాగేశ్వర్ రెడ్డి, రైతు, రాంపూర్ గ్రామం, నర్వ మండలం
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు
నాకు నెల్లికొండి శివారులో 22 ఎకరాల భూమి ఉంది. మా ఊరి మీదుగా కోయిల్‌సాగర్ కాలువ పోతుంది. అందులో ఇప్పుడు పిచ్చి మొక్కలు పెరిగాయి. నీరు రావడం లేదు. ఈ విషయాన్ని ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన పట్టించుకుంటలేరు. -చాకలి నరసింహ, రైతు, నెల్లికొండి గ్రామం, చిన్నచింతకుంట మండలం
