- ఎయిమ్స్ మాజీ డైటీషియన్
- దీప్తా నాగ్ పాల్ హెచ్చరిక
న్యూఢిల్లీ: టైప్ 2 డయాబెటిస్ కోసం వినియోగించే ఒజెంపిక్(సెమాగ్లుటైడ్) ఇంజక్షన్ ను బరువు తగ్గేందుకు వాడితే దుష్పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సూది మందు కొవ్వును మాత్రమే కాకుండా శరీరంలోని కండరాలనూ కరిగిస్తుందని, అందుకే డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా దీనిని వాడరాదని ఎయిమ్స్ మాజీ డైటీషియన్ దీప్తా నాగ్ పాల్ వెల్లడించారు.
ఒజెంపిక్ సూది మందును టైప్ 2 డయాబెటిస్ నిర్వహణ కోసం విడుదల చేశారు. కానీ ఈ మందు ఆకలిని బాగా మందగించేలా చేస్తూ బరువును కూడా వేగంగా తగ్గిస్తోంది. దీంతో మన దేశంలో ఒబెసిటీని తగ్గించుకునేందుకు ఒజెంపిక్ ఇంజక్షన్ ను విస్తృతంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మందు సైడ్ ఎఫెక్ట్స్ గురించి దీప్తా ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు.
‘‘ఒజెంపిక్ (సెమాగ్లుటైడ్) బరువు తగ్గేందుకు సాయం చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్‌ను మెరుగుపరుస్తుంది. కొవ్వు కరిగేందుకు దోహదపడుతుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి” అని ఆమె తెలిపారు. ‘‘గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఈ మందు ప్రమాదకరం. పేగు సమస్యలు తీవ్రంగా ఉన్నవారు కూడా దీనిని తీసుకోరాదు” అని ఆమె స్పష్టం చేశారు.
పోషకాహార లోపానికి దారి తీస్తుంది..
ఒజెంపిక్‌ను దీర్ఘకాలం వాడటం వల్ల తిండి తినడం గణనీయంగా తగ్గిపోతుందని, ఫలితంగా అలసట, బలహీనత, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయని దీప్తా వెల్లడించారు. ‘‘తిండి తగ్గిపోవడం వల్ల పోషకాహార లోపానికి దారి తీయవచ్చు. తగినంత ప్రొటీన్ ఫుడ్, స్ట్రెంత్ ట్రెయినింగ్ తీసుకోకుండా ఈ మందును వాడితే కొవ్వు మాత్రమే కాదు.. కండరాలు కూడా కరిగిపోతాయి. మెటబాలిజం మందగిస్తుంది. వాంతులు, పొట్టలో ఉబ్బరం, తీవ్ర అలసట వస్తాయి” అని ఆమె తెలిపారు.
‘‘అరుదుగా ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ సమస్యలు కూడా వస్తాయి. తిండి, లైఫ్ స్టైల్ అలవాట్లను మార్చుకోకుండా ఒజెంపిక్‌ను ఆపేస్తే గనక.. మళ్లీ వేగంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఈ మందును వాడటం మంచిది కాదు” అని దీప్తా హెచ్చరించారు.
