- భవిష్యత్తులో కీలకంగా మారనున్న మండలి
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా విధ్వంసానికి గురైన గాజా పునర్నిర్మాణానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 15న గాజా ‘శాంతి మండలి’ (బోర్డ్ ఆఫ్ పీస్) ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేశారు. రెండు భాగాలుగా ఉండే ఈ బోర్డులో ప్రధాన విభాగానికి స్వయంగా ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగుతారు. రెండోది ఎగ్జిక్యూటివ్ బోర్డు అని, పూర్తిగా సలహాదారుగా వ్యవహరించనుందని తెలుస్తోంది.
ఈ బోర్డులో చేరాలంటూ ఇండియాకు ట్రంప్ ఆహ్వానం పలికారు. ఇటు ఇజ్రాయెల్‌తో, అటు పాలస్తీనాతోనూ ఇండియాకు ఉన్న చారిత్రక సంబంధాల నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం కారణంగా ఆహార కొరతతో అల్లాడుతున్న గాజా వాసులకు తొలుత మానవతా సాయాన్ని పంపించిన దేశం మనదే.
కాగా, ఇండియాతో పాటు పాకిస్తాన్ సహా పలు దేశాలకూ ఆహ్వానం అందినట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ బోర్డు మిగతా ప్రపంచ సమస్యలపైనా దృష్టి సారిస్తుందని, వాటి పరిష్కారాలలో కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ట్రంప్ ఆహ్వానించిన దేశాల్లో ఒక్క హంగేరీ తప్ప ఇప్పటి వరకు వేరే ఏ దేశమూ బోర్డులో చేరేందుకు అంగీకారం తెలపలేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఆహ్వానాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
