న్యూఢిల్లీ: దేశంలో ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో తెలిపారు. దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా కేంద్ర సర్కారు భారీగా సబ్సిడీలను భరిస్తోందని పేర్కొన్నారు. ఇందుకోసం ఇటీవల అనుబంధ పద్దుల ద్వారా సుమారు రూ. 19,230 కోట్లు అదనంగా కేటాయించిందన్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ వంటి వాటిపై ప్రభావం పడినప్పటికీ, దేశీయంగా ఎరువుల తయారీ, దిగుమతికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎరువుల కొరత ఉందంటూ వస్తున్న పుకార్లను నమ్మొద్దని, సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోందన్నారు.
