సస్పెండెడ్ CISF కానిస్టేబుల్ గాంజా దందా.. జైలుకు వెళ్లొచ్చినా మారలే..!

సస్పెండెడ్ CISF కానిస్టేబుల్ గాంజా దందా.. జైలుకు వెళ్లొచ్చినా మారలే..!

పద్మారావునగర్​,వెలుగు: సస్పెండెడ్​ సీఐఎస్ఎఫ్ ​కానిస్టేబుల్ గాంజా దందా బయటపడింది. ఇదివరకే ఒకసారి గంజాయితో చిక్కి జైలుకు వెళ్లగా ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్​ చేశారు. అయినా తీరు మార్చుకోక అదే దందా చేస్తూ సిటీ టాస్క్​ఫోర్స్​పోలీసులకు చిక్కాడు. జీతం సరిపోక ఆర్థిక  ఇబ్బందులతోనే గంజాయి బిజినెస్ ​చేశానని చెప్పాడు. రూ. 79 లక్షల విలువైన 158 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి  సీతారామరాజు జిల్లా, మొతుగూడెం గ్రామానికి చెందిన పనగూడు శివకృష్ణ 2009లో సీఐఎస్ఎఫ్‎లో కానిస్టేబుల్‌గా చేరాడు. ఆ తర్వాత డెప్యుటేషన్‌పై ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో కూడా పనిచేశాడు. అయితే, అప్పుల నుంచి బయటపడటానికి, వివిధ రాష్ట్రాల్లో గంజాయికి ఉన్న భారీ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఆ వ్యాపారంలోకి దిగాడు. 

ఒడిశాకు చెందిన ఓ సాగుదారుడి నుంచి భారీగా గంజాయిని సేకరించి, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల్లోని డ్రగ్ పెడ్లర్లకు సరఫరా చేసేవాడు.ఈ అక్రమ రవాణాలో నిందితుడు తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకున్నాడు. పోలీస్ చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు జరిగినప్పుడల్లా తన సీఐఎస్‌ఎఫ్ ఐడీ కార్డును చూపించి పోలీసుల కళ్లు కప్పుతూ తప్పించుకునేవాడు.

గతంలో 2025లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహా కేసులో అరెస్ట్ అయి ఖమ్మం జైలుకు వెళ్లడమే కాకుండా, సస్పెండయ్యాడు. అయినప్పటికీ జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ప్రవర్తన మార్చుకోకుండా ఈ దందా కొనసాగిస్తున్నాడు. 

ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో టాస్క్​ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ యదేందర్, ఎస్సై రవిరాజ్ బృందం, ఎస్ఆర్. నగర్ పోలీసులతో కలిసి మంగళవారం రాత్రి ఎస్ఆర్. నగర్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ పక్క వీధిలో నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 158 కిలోల ఎండు గంజాయితోపాటు ఒక కారు, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.