ప్లాస్టిక్​ చెత్త నుంచి జీన్స్​

ప్లాస్టిక్​ చెత్త నుంచి జీన్స్​

రాయల్‌‌ క్లాసిక్‌‌ మిల్స్‌‌కు చెందిన దేశీయ పురుషుల ఫ్యాషన్‌‌బ్రాండ్‌‌ క్లాసిక్‌‌ పోలో సస్టైనబుల్‌‌ జీన్స్‌‌, బ్యాంబూ షర్ట్స్‌‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీనియర్‌‌ ఆఫీసర్లు వీటిని ఆవిష్కరించారు. ఇవి పర్యావరణానికి అనువైనవని ప్రకటించారు. ప్లాస్టిక్‌‌ వ్యర్థాలు, బీటీ కాటన్‌‌, కొన్ని ప్రత్యేక రసాయనాలతో సస్టైనబుల్‌‌ జీన్స్‌‌ను తయారు చేశామని  తెలిపారు. సాధారణ జీన్స్‌‌తో పోలిస్తే వీటిని ఉతకడానికి 70 శాతం తక్కువ నీరు చాలని కంపెనీ తెలిపింది. వెదురు వ్యర్థాలతోనూ తయారు చేసిన కాటన్‌‌ షర్ట్స్‌‌కు ఎంతో ఆదరణ ఉందని ప్రకటించింది. ఈ సందర్భంగా క్లాసిక్‌‌ పోలో రిటైల్‌‌ విబాగం డైరెక్టర్‌‌ రమేశ్‌‌ ఖేనీ విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తమ కంపెనీకి 130 రిటైల్ ఔట్‌‌లెట్లు, ఆరు వేల మల్టీబ్రాండ్‌‌ షోరూమ్‌‌లు ఉన్నాయని చెప్పారు. ఏపీ, తెలంగాణలో 18 రిటైల్‌‌ ఔట్‌‌లెట్లు ఉన్నాయని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమ అమ్మకాలు బాగున్నాయని, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లో అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి సారించామని చెప్పారు. కంపెనీ సీనియర్ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ ధ్యానేశ్‌‌ కుమార్‌‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది రూ.రెండు వందల కోట్ల టర్నోవర్‌‌ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బిజినెస్‌‌ డెవెలప్‌‌మెంట్‌‌ జీఎం శ్రీకాంత్‌‌ మాట్లాడుతూ తమిళనాడులోని తిరువూరు ప్లాంటులో తమ ఉత్పత్తులన్నీ తయారు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్లాంటుకు రోజుకు 40 టన్నుల దుస్తులు తయారు చేయగల సామర్థ్యం ఉందని చెప్పారు.