శ్రీలంకపై దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ

శ్రీలంకపై దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ
  • 4 వికెట్ల తేడాతో లంకపై సఫారీ గెలుపు
  • హసరంగ హ్యాట్రిక్ వృధా

షార్జా: టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొంది.. టోర్నీలో రెండో విజయాన్ని కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేసింది. టార్గెట్ ఛేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా చివర్లో వికెట్లు పడిపోవడం.. సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరడగంతో విజయావకాశాలు మూసుకుపోయినట్లే కనిపించింది. అయితే చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ రెండు సిక్సులు కొట్టి స్కోర్ అమాంతం పెంచేయగా.. రబాడా ఫోర్ కొట్టి మరో బంతి మిగిలి ఉండగానే గెలుపు అందించాడు. దక్షిణాఫ్రికా  19.5 ఓవర్లలో 143 పరుగులు చేసి ఉత్కంఠ విజయం నమోదు చేసుకుంది. 
 టాస్ గెలిచి శ్రీలంకకు బ్యాటింగ్ ఇచ్చిన దక్షిణాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్ తో భారీ స్కోరు చేయకుండా కళ్లెం వేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన నాలుగో ఓవర్ లోనే శ్రీలంక ఓపెనర్ కుశాల్ పెరీరా (7)ను పెవిలియన్ పంపి పట్టు బిగించిన దక్షిణాఫ్రికా.. పవర్ ప్లే వరకు అదే పట్టు కొనసాగించడంతో శ్రీలంక పవర్ ప్లే పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి కేవలం 39 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చరిత్ అసలంక మరో ఓపెనర్ నిశాంకతో కలసి ధాటిగా ఆడి రన్ రేట్ పెంచేశాడు. బ్యాటర్లు పెద్దగా సహకరించకున్నా ఓపెనర్ నిశాంక 19 ఓవర్ వరకు నిలదొక్కుకుని బ్యాట్ ఝుళిపించడంతో శ్రీలంక 142 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో  తబ్రెజ్ షంసి, డ్వెయిన్ ప్రిటోరియస్ మూడేసి వికెట్లు తీయగా .. నోర్జే రెండు వికెట్లు పడగొట్టాడు. 
తడబడి ఓటమి అంచులకు చేరి.. అనూహ్య విజయం 
శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తడబడుతూ చివరి ఓవర్ వరకు ఓటమి ముంగిట నిలిచింది. నాలుగో ఓవర్లోనే ఒద్దరు ఓపెనర్లను లంక పెవిలియన్ బాట పట్టించడంతో దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెరిగింది. అయితే బావుమా, మార్ క్రమ్ నిలదొక్కుకుని పరుగులు సాధిస్తుండడంతో రన్ రేట్ పెరిగి దక్షిణాఫ్రికా గెలుపు దిశలో వెళ్తున్నట్లు కనిపించింది. అయితే లంక స్పిన్నర్ హసరంగ స్పిన్ మాయాజాలం సృష్టించి మార్కక్రమ్, సఫారి కెప్టెన్ బవుమా (46), ప్రిటోరియస్ వికెట్లను పడగొట్టడం కలకలం రేపింది. 15 ఓవర్ చివరి బంతికి మార్ క్రమ్ ను ఔట్ చేసిన హసరంగ తిరిగి 18వ ఓవర్లో బంతి తీసుకుని తొలిబంతికి కెప్టెన్ బవుమాను, రెండో బంతికి ప్రిటోరియస్ ను డకౌట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ముఖ్యంగా మ్యాచ్ ను గెలిపించుకునే యత్నంలో ఉన్న కెప్టెన్ బవుమా ఔట్ కావడంతో సఫారీ జట్టుపై ఒత్తిడి పెరిగింది. చివరి రెండు ఓవర్లలో సఫారీ జట్టు టార్గెట్ 25 పరుగులుగా ఉంది. 19వ ఓవర్లో 10 పరుగులు రాబట్టుకుంది. ఇక టార్గెట్ 6 బంతులు 15 పరుగులుగా మారింది. నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. డేవిడ్ మిల్లర్, రబాడా క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా చిక్కుల్లో పడినట్లు హై ఓల్టేజీ వాతావరణం ఏర్పడింది. తొలి బంతికి రబాడ సింగిల్ తీయగా.. రెండు, మూడో బంతులను ఎదుర్కొన్న డేవిడ్ మిల్లర్ వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. నాలుగో బంతికి మిల్లర్ సింగిల్ తీశాడు. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు సాధించాల్సి ఉండగా.. 5వ బంతిని రబాడా బౌండరీ కొట్టి విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు పడగొట్టి కెరీర్ లో హ్యాట్రిక్ నమోదు చేసుకోగా.. చమీర రెండు వికెట్లు తీశాడు.